APPSC Group 2 Prelims: ఒకే రోజు గ్రూపు-2, ఎస్‌బీఐ క్లరికల్‌ పోస్టుల రాత పరీక్షలు.. అభ్యర్ధుల్లో గందరగోళం

|

Feb 19, 2024 | 7:09 AM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ నిర్లక్ష్య వైఖరి నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఎన్నో యేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌ 2 పరీక్షపై రోజుకో ప్రకటన వెలువడుతుండటంతో నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. ఏపీపీఎస్సీ వెనకాముందు చూసుకోకుండా ఈ నెల 25వ తేదీన గ్రూప్‌ 2 ప్రిలిమినరీ పరీక్ష..

APPSC Group 2 Prelims: ఒకే రోజు గ్రూపు-2, ఎస్‌బీఐ క్లరికల్‌ పోస్టుల రాత పరీక్షలు.. అభ్యర్ధుల్లో గందరగోళం
APPSC Group 2
Follow us on

అమరావతి, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ నిర్లక్ష్య వైఖరి నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఎన్నో యేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌ 2 పరీక్షపై రోజుకో ప్రకటన వెలువడుతుండటంతో నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. ఏపీపీఎస్సీ వెనకాముందు చూసుకోకుండా ఈ నెల 25వ తేదీన గ్రూప్‌ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. సరిగ్గా అదే రోజున ఎస్‌బీఐ క్లరికల్‌ మెయిన్స్‌ పరీక్ష కూడా ఉంది. ఉద్యోగ నియామక తేదీలు ఖరారు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియామక సంస్థల ద్వారా జరిగే పరీక్షలు, వాటి తేదీలను పరిగణనలోకి తీసుకొని ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించాలి.

కానీ.. గ్రూపు-2 ప్రిలిమ్స్‌ తేదీ ఖరారులో ఇలాంటి ప్రమాణాలను ఏపీపీఎస్సీ పాటించలేదు. ఎస్‌బీఐ పరీక్ష తేదీని పరిగణనలోకి తీసుకోకుండా అదే రోజు పరీక్ష తేదీని ప్రకటించింది. నిజానికి, ఎస్‌బీఐ నోటిఫికేషన్‌ గత నవంబరులో విడుదలైంది. ఆ నోటిఫికేషన్‌లోనే ఫిబ్రవరి 25న మెయిన్స్‌ ఉంటుందని స్పష్టంగా ప్రకటించింది కూడా. దీనికి అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధత ప్రారంభించారు. ఎస్‌బీఐ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత గ్రూపు-2 నోటిఫికేషన్‌ గత డిసెంబరు 7వ తేదీన ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్‌ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహిస్తామని కమిషన్‌ ప్రకటించింది. రెండూ పరీక్షలు ఒకటే రోజున ఉన్నందున ఏ పరీక్ష రాయాలో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

కాగా మొత్తం 897 గ్రూపు-2 ఉద్యోగాలకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూపు-2 నోటిఫికేషన్‌ జారీకి, ప్రిలిమ్స్‌ నిర్వహణ తేదీ మధ్య ఇచ్చిన సమయం కూడా తక్కువగా ఉంది. దీంతో గత కొద్ది కాలంగా ప్రిలిమ్స్‌ నిర్వహణ తేదీని వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండు వస్తోంది. కొందరు అభ్యర్థులు విజయవాడలో కేంద్రం కేటాయించాలని దరఖాస్తులో పేర్కొంటే గుడివాడలో ఇచ్చారు. ఇలాగే ఇతర జిల్లాల్లోనూ జరిగింది.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ హాల్‌టికెట్లు పంపితే తేదీని మార్పిస్తాం: ఏపీపీఎస్సీ ప్రకటన

ఎస్‌బీఐ క్లరికల్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారు హాల్‌టికెట్లను తమకు పంపిస్తే ఎస్‌బీఐ ఉన్నతాధికారులను సంప్రదించి, పరీక్ష తేదీని మార్పిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. వారందరికీ మార్చి 4న (మరో స్లాట్‌) పరీక్ష నిర్వహించేందుకు ఎస్‌బీఐ ఆమోదించినట్లు తెల్పింది. ఇంకా ఎవరైనా ఉంటే మెయిల్‌ అడ్రస్‌: appschelpdesk@gmail.comకు ఫిబ్రవరి 19లోగా తెలియజేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.