ఒంగోలు, మార్చి 17: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రాథమిక (ప్రిలిమ్స్) పరీక్ష ఆదివారం (మార్చి 17) నిర్వహించారు. మొత్తం రెండు పేపర్లకు ఈ పరీక్ష జరిగింది. మొదటి పేపర్ ఉదయం సెషన్‌లో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగింది. అయితే ఈ రోజు ఉదయం మొదటి సెషన్‌లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీయింగ్ వ్యవహారం ఒంగోలులో వెలుగు చూసింది.
స్థానిక వెంగముక్కపాలెం రోడ్డులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన పరీక్షలో ఓ అభ్యర్థి అధికారుల కళ్లుగప్పి మొబైల్ ఫోన్‌తో పరీక్ష హాలులోకి ప్రవేశించాడు. ఫోన్ సాయంతో కాపీయింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు తనిఖీలు చేసినప్పటికీ సెల్‌ఫోన్‌ను పరీక్ష గది లోపలికి తీసుకువెళ్లాడు. ఫోన్ ద్వారా బయట వ్యక్తులకు కాల్ చేసి సమాధానాలు తెలుసుకుని రాస్తుండగా ఇన్విజిలేటర్ గమనించి పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై ఆ అభ్యర్థిని పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా రాష్ట్రంలో ఆదివారం గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నేపథ్యంలో పరీక్ష కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద అధికారులు నిషేధాజ్ఞలు విధించడంతో పాటు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించి పరీక్షల్లో ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోకుండా పకద్భందీగా నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం ద్వారా పరీక్షల తీరును పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లు, ఇతర సామగ్రిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.