అమరావతి, మార్చి 17: తెలుగు రాష్ట్రాల్లో రేపట్నుంచి (మార్చి 18) పదో తరగతి 2024 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు సబ్జెక్ట్‌లకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,473 ఎగ్జాం సెంటర్లను విద్యాశాఖ సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు 28వ తేదీతో ముగియనుండగా.. మిగతా రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు జరపనున్నారు. పేపర్ లీకేజీ వంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజలేటర్లతోపాటు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు. 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 7, 25,620 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6,23,092 మంది ఉండగా.. గత ఏడాది ఫెయిలై అయిన విద్యార్ధులు 1,02,528 మంది ఉన్నారు. లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నాపత్రానికి ప్రత్యేక యూనిక్ కోడ్ నంబర్ ప్రింట్ చేశారు. ఈ యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో క్షణాల్లో తెలుసుకునేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఉదయం 8.45 నిమిషాల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. హాల్ టిక్కెట్లు చూపితే ఆర్టీసీ బస్సులో టెన్త్ విద్యార్ధులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు.0866-2974540 నంబర్‌తో రాష్ట్ర స్ధాయిలో కంట్రోల్ రూమ్‌తోపాటు ప్రతీ జిల్లాలో కలెక్టర్లు, డిఇఓల పర్యవేక్షణలో జిల్లా స్ధాయి కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాకి ఒక పరిశీలకుడు, రాష్ట్ర వ్యాప్తంగా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 3473 చీఫ్ సూపరింటెండెంట్లు, 35,119 మంది ఇన్విజలేటర్లు, 3473 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారు. పరీక్షల అనంతరం ఈ నెల 31 నుంచే టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ జరపనున్నారు.
మరో వైపు తెలంగాణలోనూ మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు. ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేసి 5 నిమిషాల గ్రేస్ టైం ఇచ్చినట్లు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. దీంతో 9.35 నిమిషాల వరకు విద్యార్ధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మొత్తం 2,676 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విధించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.