AP Mega DSC 2025: ‘డీఎస్సీ పరీక్ష సన్నద్ధతకు 90 రోజుల సమయం ఇవ్వాలి.. దరఖాస్తు గడువు పెంచాలి’ నిరుద్యోగుల విజ్ఞప్తి

నిరుద్యోగులు పోరాట ఫలితంగా ఏడేళ్ల తర్వాత 16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఆ ఆనందం నిరుద్యోగుల ముఖాల్లో కనిపించడం లేదు. ఎందుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చాక సన్నద్ధతకు సమయం ఇవ్వలేదని, కనీసం 90 రోజుల సమయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వయోపరిమితి కూడా పెంచాలంటూ..

AP Mega DSC 2025: డీఎస్సీ పరీక్ష సన్నద్ధతకు 90 రోజుల సమయం ఇవ్వాలి.. దరఖాస్తు గడువు పెంచాలి నిరుద్యోగుల విజ్ఞప్తి
DSC Applicants demanding preparation time

Updated on: May 15, 2025 | 7:30 AM

అమరావతి, మే 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత నెల 20వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నియామక ప్రక్రియకు దరఖాస్తు గడువు నేటి (మే 15)తో ముగియనుంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే ఇంతపెద్ద మొత్తంలో పోస్టులు తొలిసారి రావడంతో నిరుద్యోగులు ఆశలన్నీ వీటిపైనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో డీఎస్సీ గడువు, వయోపరిమితి, జిల్లాకు ఒకే పేపర్ విధానం కోసం అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అభ్యర్థులు నిరసన చేస్తున్నారు.

నిరుద్యోగులు పోరాట ఫలితంగా ఏడేళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందని, పరీక్షకు కనీసం 90 రోజులను సమయం ఇవ్వాలని కోరుతున్నారు. వయోపరిమితి 44 నుంచి 47 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయిన వారికి వయస్సు పెరిగిందన్నారు. అటు తెలంగాణలోనూ ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచారనీ, ఏపీ కూడా 47 ఏళ్ల వరకు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే డీఎస్సీలో నార్మలైజేషన్ రద్దుచేసి జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు డీఎస్సీ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జూన్‌ 6 నుంచి జులై 6 వరకు మొత్తం నెల రోజులపాటు నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర విద్యా శాఖ స్పష్టం చేసింది. అయితే సరిగ్గా ఇదే తేదీలో కేంద్ర రైల్వేశాఖకు చెందిన RRB NTPC నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ పోస్టుల పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ పోస్టులకు దేశ వ్యాప్తంగా ఏకంగా 1.2 కోట్ల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో నెలలుగా ప్రిపేరవుతున్న వారు డీఎస్సీ రాయాలా? లేదంటే ఆర్‌ఆర్‌బీ రైల్వే ఎగ్జాం రాయాలా? అని సందిగ్ధంలో ఉన్నారు. ఒకటి రాస్తే మరో పరీక్షను కోల్పోవల్సి ఉంటుంది. ఇవే కాకుండా పలు బ్యాంకు పరీక్షలు, యూజీసీ నెట్‌ 2025 పరీక్షలు కూడా జూన్‌ నెలలోనే జరగున్నాయి. ఏ పరీక్ష రాయాలో ఏది వదులుకోవాలో తెలియక నిరుద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డీఎస్సీ పరీక్ష తేదీలను వాయిదా వేయాలని నిరుద్యోగులు విజ్ఞప్తులు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.