
అమరావతి, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు హాల్‌టికెట్లను కూడా విడుదల చేసింది. అయితే బోర్డు వెబ్‌సైట్‌తోపాటు ‘మనమిత్ర’ వాట్సప్ ద్వారా కూడా ఇంటర్ హాల్ టికెట్లు పొందొచ్చని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. పలు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని విద్యార్ధులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు బోర్డు దృష్టికి రావడంతో.. ఇలా చేయకుండా ఉండేందుకు నేరుగా విద్యార్ధులకు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. రాష్ట్ర విద్యార్ధులు ఇంటర్మీడియట్ వెబ్‌సైట్ నుంచి లేదా వాట్సప్ నంబరు 95523 00009 ద్వారా గానీ హాల్‌టికెట్లను నేరుగా పొందే వెసులుబాటు కల్పించారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు దాదాపు 1535 సెంటర్లలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాదికి ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. మొత్తం విద్యార్ధుల్లో జనరల్ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తయిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ సమయంలో ఇంటర్ సెకండ్ ఇయర్‌కు సంబంధించిన పాఠాలతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు బోధిస్తారు. అనంతరం వీరికి ఏప్రిల్ 24 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఇస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.