
అమరావతి, నవంబర్ 14: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు నవంబరు 15 నుంచి నిర్వహించే ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని కన్వీనర్ రామమోహనరావు తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు నవంబర్ 15 నుంచి 17 వరకు ఉంటుందని, ధ్రువపత్రాల పరిశీలన నవంబర్ 16 నుంచి 18 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇక కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు నవంబర్ 17 నుంచి 19 ఉంటుందని తెలిపారు. నవంబర్ 20వ తేదీన వెబ్ ఐచ్ఛికాల మార్పుకు అవకాశం కల్పించారు. నవంబర్ 22త తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు అదే నెల 23వ తేదీ లోపు సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.
తెలంగాణ ఎడ్‌సెట్ 2023 ప్రత్యేక విడత కౌన్సెలింగ్ పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన సీట్లను మంగళవారం (నవంబర్ 14) కేటాయించినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఆచార్య పి రమేష్‌బాబు తెలిపారు. కన్వీనర్ కోటా కింద 6,419 బీఈడీ సీట్లు అందుబాటులో ఉండగా, వీటికి 3,988 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు తెలిపారు. వారిలో ప్రత్యేక విడత కౌన్సెలింగ్ 2,604 మందికి సీట్లు దక్కినట్లు తెలిపారు. కౌన్సెలింగ్ తర్వాత మొత్తం 3,815 సీట్లు మిగిలిపోయాయని ఆయన పేర్కొన్నారు. తాజాగా సీట్లు పొందిన వారితో కలిపి మొత్తం కన్వీనర్ కోటా కింద10,454 మంది ప్రవేశాలు పొందినట్లు కన్వినర్ తెలిపారు. ప్రత్యేక విడతలో సీట్లు పొందిన వారు ఫీజు చెల్లించి నవంబర్ 15 నుంచి 17వ తేదీ లోపు కాలేజీల్లో ధ్రువపత్రాలను సమర్పించి, ప్రవేశాలు పొందాలని ఆయన సూచించారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) పరిధిలో 2023 – 24 విద్యా సంవత్సరానికి గానూ పది, ఇంటర్మీడియట్‌లలో చేరేందుకు నవంబర్ 16 నుంచి 30వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు టాస్ సంచాలకుడు పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ప్రవేశాలు పొందాలని ఆయన సూచించారు. ఇతర పూర్తి వివరాలు టాస్ అధికారిక వెబ్‌సైట్లో ఉంచామని పేర్కొన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.