
అమరావతి, అక్టోబర్ 23: రాష్ట్ర విద్యాశాఖ రేపు (శుక్రవారం) టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ వెలువరించనుంది. లేదంటే శనివారం విడుదలచేసే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు తాజాగా ప్రకటన వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ పరీక్షకు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న టీచర్లకూ అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో తాజాగా వెలువడే టెట్ పరీక్షకు నిరుద్యోగులతోపాటు ప్రభుత్వ టీచర్లు కూడా పోటీపడే అవకాశం కనిపిస్తుంది. 2011కు ముందు టెట్ లేకుండా టీచర్లుగా ఎంపికైన వారందరూ టెట్‌లో అర్హత సాధించాల్సిందేనని సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరికీ టెట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రేపు లేదంటే ఎల్లుండి టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు టీచర్ ఉద్యోగంలో కొనసాగాలంటే సెప్టెంబర్ 1 నుంచి రెండేళ్లలో టెట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఐదేళ్లలో పదవీవిరమణ చేయబోయే వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదు. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాసవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో నవంబరులో నిర్వహించే టెట్‌కు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలా? వద్దా? అనేదానిపై అధికారులు సమాలోచనలు చేసి.. ఎట్టకేలకు వారు కూడా పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించారు.
మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్లు కూడా వేశాయి. ఈ తీర్పు కోసం వేచి ఉండేవారికి కూడా వెసులుబాటు కల్పిస్తారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తుంది. టెట్ పరీక్ష రాసేందుకు అర్హత మార్కులు కేటగిరీల వారీగా భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్ధులకు డిగ్రీలో 40 శాతం మార్కులున్నా బీఈడీలో ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే బీఈడీ పూర్తిచేసిన తర్వాత టెట్ రాయాలంటే మాత్రం 45 శాతం అర్హత మార్కులు పొందాల్సి ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ నిబంధనను సడలిస్తూ 40 శాతం మార్కులు ఉన్నా టెట్ రాసేందుకు అవకాశం కల్పించారు. అయిత ఈ ఏడాది నవంబర్ టెట్ పరీక్షలో మాత్రం 45 శాతం అర్హత మార్కుల నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
నిజానికి టెట్ అర్హతలను 2011కు ముందు, ఆ తర్వాత విద్యార్హతల్లో మార్పులు వచ్చాయి. 2011కు ముందు ఎస్జీటీలకు ఇంటర్మీడియట్‌లో ఓసీలకు 45 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 40 శాతం అర్హత మార్కులు ఉండేవి. 2011 తర్వాత వారికి పేపర్ 1 ఎస్జీటీ ఓసీ అభ్యర్థులకు 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 45 శాతం మార్కులు ఉండాలి. పేపర్ 2 అభ్యర్ధులకు ఓసీలకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులుగా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు విద్యార్హతల్లో కనీస మార్కులు ఎంత ఉండాలనే దానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.