
అమరావతి, జూన్ 1: మెగా డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తాజాగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి వివరణాత్మక షెడ్యూల్‌ను విద్యాశాఖ జారీ చేసింది. తొలత జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ అవే రోజుల్లో ఆర్‌ఆర్‌బీ, యూజీసీ నెట్ సహా పలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలను జూన్ 30వ తేదీకి కుదించారు. తాజాగా జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. అనంతరం స్కూల్ అసిస్టెంట్లకు పరీక్షలు జరుగుతాయి. అయితే కొంతమంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు పరీక్ష తేదీల్లో అందుకు అనుగుణంగా మార్పులు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కొన్ని పరీక్షలు మధ్యలో, మరికొన్ని చివరిలో వచ్చేలా షెడ్యూల్ ఇచ్చారు. దీంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్షలు జూన్ 8 నుంచి 10 వరకు, ఆ తర్వాత మళ్లీ జూన్ 12, 13, 16, 17, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఎస్జీటీలకు జూన్ 13,17,18, 19, 20, 21 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. పీజీటీలకు జూన్ 8, 14, 18, 19, 20, 23, 25, 28 తేదీల్లో, టీజీటీలకు జూన్ 6, 11, 22, 25, 26, 27 తేదీల్లో పరీక్షలు జరిగేలా షెడ్యూల్ చేశారు. టీజీపీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జూన్ 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో కలిపి రోజుకు సుమారు 40 వేల మంది వరకు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు.
అయితే తాజాగా పలు పోస్టులకు కొందరి దరఖాస్తులను విద్యాశాఖ స్వీకరించలేదు. ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఇంగ్లిష్ సబ్జెక్ట్ చదివిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఛాన్స్ ఇవ్వలేదు. అలాగే టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులతోపాటు ఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్షలు రాసేందుకు హాల్‌టికెట్లు జారీ చేయలేదు. ఇక పరీక్షల అనంతరం ఫలితాలను ఆగస్టు రెండో వారంలో విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. నిర్ణయించారు. ఈ పరీక్షలకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.