అమరావతి, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్’, ‘సోషల్ మీడియా అసిస్టెంట్’ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీ) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లను, 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్‌లను ఈ నోటిఫికేషన్ కింద నియమించనుంది. ఈ పోస్టులను అవుట్‌సోర్సింగ్/తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌కి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు విద్యార్హతలు ఏమేం ఉండాలంటే.. బీఈ, బీటెక్‌తోపాటు సోషల్ మీడియాపై అవగాహన ఉండాలని నిర్ణయించారు. వీరికి నెలకు రూ.50 వేల చొప్పున వేతనంగా చెల్లిస్తారు. సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకి విద్యార్హత.. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. వీరికి నెలకు రూ.30 వేల చొప్పున జీతం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు లేటెస్ట్ రెజ్యూమేను info.apdcl@gmail.com ఐడీకి ఈమెయిల్ చేయాలి. సెప్టెంబర్ 23, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర వివరాలకు https://www.apdc.ap.gov.in/ , http://ipr.ap.gov.in/ వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.
ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్- 2024 ఫలితాలను రిజిస్ట్రార్ రఘురామిరెడ్డి విడుదల చేశారు. అగ్రిసెట్, ఇంజినీరింగ్ సెట్‌లలో వచ్చిన ర్యాంకు ఆధారంగా.. వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులు నేరుగా వ్యవసాయ బీఎస్సీ, వ్యవసాయ ఇంజినీరింగ్ కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్షలు ఆగస్టు 24న నిర్వహించగా.. తాజాగా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వ్యవసాయ బీఎస్సీలో 92, ఇంజినీరింగ్‌లో 8 చొప్పున సీట్లు వర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కోచింగ్ సెంటర్లలో విధివిధానాలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. కోచింగ్ సెంటర్ల నిర్వహణలో పాటించాల్సిన మార్గదర్శకాలపై ఈ చర్చ జరిగింది. మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు కావట్లేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసిందని, వీటిని అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లలో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.