అమరావతి, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కోటా కింద అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ జరగాలని నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది అక్టోబరులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూఎస్ కోటా పూర్తి స్థాయిలో అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు కలిగిన అన్ని మెడికల్ కాలేజీల్లోఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం మైనారిటీ విద్యాసంస్థలకు వర్తించదు. ఎంబీబీఎస్‌తోపాటు పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కోటా వర్తిస్తుంది. అయితే సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇది వర్తించదని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఇటీవల నీట్ యూజీ 2024 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ర్యాంకులను కూడా వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో 33 జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ క్లారిటీ ఇచ్చారు. జీవో 33తో స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి దామోదర్ తప్పుబట్టారు. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు సంబంధించి 2017 జులై 5న కేసీఆర్ సర్కార్ జారీ చేసిన జీవో 114ని మంత్రి ప్రస్తావించారు. నాటి జీవోలో 9 నుంచి 12 తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తూ చేసిన నిబంధనలనే తాజాగా విడుదల చేసిన జీవో 33లోనూ కొనసాగించామన్నారు. పాత జీవోలోని 6 నుంచి 12 వరకు కనీసం నాలుగేళ్లు విద్యార్థులు చదివిన ప్రాంతానికి స్థానికతను వర్తింపజేయాలన్న నిబంధనను కొనసాగించలేమన్నారు. జీవో 114లోని ఈ నిబంధన ప్రకారం విద్యార్థి నాలుగేళ్లు తెలంగాణలో, మిగతా మూడేళ్లు ఏపీలో చదివితే వారిని తెలంగాణ స్థానికులుగా పరిగణించినట్లు గుర్తు చేశారు. అయితే ఏపీ విభజన చట్టం ప్రకారం జూన్ 2తో పదేళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో పాత నిబంధనలు కొనసాగించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.