AP Intermediate Board: ఇంటర్మీడియట్‌ బోర్డుకు కొత్త రూపు.. పునర్‌ వ్యవస్థీకరిస్తూ సర్కార్ ఉత్తర్వులు

|

Dec 17, 2024 | 4:09 PM

రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డుకు కొత్త రూపు రానుంది. ఇంటర్ బోర్డుకు సంబంధించిన తాజాగా సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు కీలక మార్పులు చేసింది. ఇకపై ఇంటర్ బోర్డులో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, బోర్డు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఎవరెవరు ఉంటారంటే..

AP Intermediate Board: ఇంటర్మీడియట్‌ బోర్డుకు కొత్త రూపు.. పునర్‌ వ్యవస్థీకరిస్తూ సర్కార్ ఉత్తర్వులు
AP Intermediate Board
Follow us on

అమరావతి, డిసెంబర్‌ 17: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యా మండలిని (BIEAP) పునర్‌ వ్యవస్థీకరిస్తూ ఏపీ రాష్ట్ర సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్‌ బోర్డుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఛైర్మన్‌గా, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వైస్‌ ఛైర్మన్‌గా ఉండనున్నారు. ఇక బోర్డు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా కళాశాల విద్య, ఇంటర్మీడియట్‌ విద్య, పాఠశాల విద్య, సాంకేతిక విద్య ఉపాధి-శిక్షణ శాఖ, తెలుగు అకాడమీ డైరెక్టర్లు, సెకండరీ విద్య బోర్డు కార్యదర్శి, సార్వత్రిక విద్యా పీఠం కార్యదర్శులు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ను రాష్ట్ర సర్కార్‌ నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి బోర్డు కన్వీనర్‌గా కొనసాగుతారు. ఆంధ్ర, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ, డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, కేజీబీవీ, రెసిడెన్షియల్‌ కళాశాలలు, ఆదర్శ పాఠశాల, నారాయణ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాళ్లను ఇంటర్‌ బోర్డు నామినేటెడ్‌ సభ్యులుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లిస్తాం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో గత రెండేళ్లుగా పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల తర్వాత చెల్లిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 16న సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ మేరకు బకాయిలను వీలైనంత తొందరగా చెల్లించడానికి కృషి చేస్తామని వివరించారు.

SSC స్టెనోగ్రాఫర్ రెస్పాన్స్‌షీట్‌ & కీ విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు ఇదే

వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్ గ్రేడ్- డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 10, 11 తేదీల్లో పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నియామక రాత పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్‌షీట్‌, ప్రాథమిక ‘కీ’ను స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను డిసెంబర్‌ 18 వరకు ఆన్‌లైన్‌లో తెలపవచ్చని పేర్కొంది. అభ్యర్థులు తమ రూల్‌ నెంబర్‌, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి వెబ్‌సైట్‌ నుంచి రెస్పాన్స్‌షీట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. కాగా మొత్తం 2,006 స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌షీట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.