అమరావతి, డిసెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్ధులకు 2024-25 విద్యాసంత్సరానికి వచ్చే మార్చిలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షల ఫీజు చెల్లింపుల గడువు విద్యాశాఖ మళ్లీ పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు పదోతరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు గడువు పెంచుకుంటూ వచ్చిన పాఠశాల విద్యాశాఖ తత్కాల్ పథకం కింద ఫీజు గడువును మరోమారు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల కింద రూ.వెయ్యి ఫీజుతో డిసెంబర్ 27 నుంచి జనవరి 10 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. విద్యార్ధులు చెల్లించిన ఫీజులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని సూచించారు.
కాగా ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ కూడా విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభమై 31వ తేదీతో ముగియనున్నాయి. అయితే మార్చి 31న సాంఘిక శాస్త్రం పరీక్ష జరగనుంచడగా.. సరిగ్గా అదే రోజున రంజాన్ పండగ వచ్చింది. రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వం పేర్కొనగా.. ఆ రోజు నెలవంక కనిపిస్తే అదే రోజు రంజాన్ ఉంటుంది. దీంతో సెలవు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజున ప్రభుత్వ సెలవు వస్తే ఏప్రిల్ 1న సాంఘిక శాస్త్రం పరీక్ష జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు.
ఇక ఈ ఏడాది మొత్తం 7 పేపర్లకు టెన్త్ పరీక్షలు జరుగుతాయని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా, జీవశాస్త్రం మరో పేపర్‌గా ఇవ్వనున్నారు. ఒక్కో పేపర్ 50 మార్కులకు ఉంటుంది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. సైన్స్ పేపర్లకైతే ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే పరీక్షల హడావిడి మొదలైంది. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్ధులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.