TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు.. షూ ధరించిన వారికి నో ఎంట్రీ!

| Edited By: Srilakshmi C

Dec 14, 2024 | 2:00 PM

తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే టీజీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1368 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు జరుగుతాయి. డిసెంబర్ 15, 16 తేదీల్లో 2 రోజుల పాటు మొత్తం 4 పేపర్లకు పరీక్ష జరగనుంది. 5,51,847 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు..

TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు.. షూ ధరించిన వారికి నో ఎంట్రీ!
TGPSC Group 2 Exam
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 14: తెలంగాణలో ఆదివారం, సోమవారం గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వగా.. 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 రిజీయన్ కేంద్రాల్లో 1368 పరీక్షా కేంద్రాలను ఎగ్జామ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు నాలుగు పేపర్ల ఎగ్జామ్ జరగనుంది. డిసెంబర్ 9 నుంచే ఆన్ లైన్ లో హాల్ టికెట్లు అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు.

మొదటిరోజు పరీక్ష డిసెంబర్ 15 (‘ఆదివారం) పేపర్ -1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ -2 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. రెండో రోజు పరీక్ష డిసెంబర్ 16 (సోమవారం) పేపర్ 3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ 4 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఒక్కో పేపర్ లో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. సమాధానం రాసేందుకు అభ్యర్థులకు OMR షీట్‌ను అందజేస్తారు. గ్రూప్ -2 పరీక్ష నిర్వహణకు 49,843 మంది విద్యాసంస్థల సిబ్బందిని కేటాయించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది 1,719 మంది పాల్గొననున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ -2 పరీక్షకు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు. పరీక్ష నిర్వహణకు 6,865 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు. సీసీ కెమెరాలతో నిఘాలో పరీక్షలు జరుగుతాయి.

అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాల్సిన నిబంధనలు

  • ప్రతి పేపర్ పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేస్తారు. ఉదయం 9.30, మధ్యాహ్నం 2.30 కి గేట్లు మూసివేత
  • ఉదయం 8.30 నుంచి, మధ్యాహ్నం 1.30 నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతి ఇస్తారు.
  • పరీక్ష హాల్ లోకి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, పాస్ పోటో అంటించిన హాల్ టికెట్ తో పాటు ఏదైన ప్రభుత్వ ఫోటో ఐడెంటింటి కార్డు తీసుకొని రావాలి
  • ఎలక్ట్రానిక్ వస్తువులు, పేపర్లు, అదనపు స్టేషనరీ ని అనుమతించరు. మంగళసూత్రం, గాజులు వంటివి మాత్రమే అనుమతి ఇస్తారు. ఇతర ఆభరణాలను కూడా అనుమతించరు. షూస్‌ ధరించిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
  • పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందుగానే చూసుకొని సరైన సమయంలో ఎగ్జామ్ కేంద్రానికి చేరుకోవాలి

టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం కీలక వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 నిర్వహిస్తున్నాం. 5.51 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. 2022లో నోటిఫికేషన్ ఇచ్చాము.. గత వారంలో సుప్రీంకోర్టు, హైకోర్టు కేసుల నుంచి గెలిచాం. మొత్తం 75 వేలమంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.75 శాతం మంది ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. 783 పోస్టులకు పరీక్ష.. ఒక్కొక్కరి ఉద్యోగానికి కనీసం 70 మంది పలుపంచుకుంటున్నారు. ఆ ఒక్క పోస్ట్ నాదే అనే కాన్ఫిడెన్స్ తో పరీక్ష రాయండి. ఎలాంటి అపోహలు వద్దు.. మెరిట్ వచ్చేలా చూసుకోండి.. ఉద్యోగం మీదే. OMR షీట్ ను అభ్యర్థులు పక్కాగా చెక్ చేసుకోవాలి.. ఎవరి OMR షీట్ వారికే ఉంటుంది. బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాసేందుకు వీలు లేదు. ఒకవేళ పరీక్ష రాసినా అది వ్యాలీడ్ కాదు.. వాల్యుయేషన్ అవ్వదు. గ్రూప్ 2 గతంలో ఇచ్చినపుడు భర్తీకి 4 ఏండ్ల సమయం పట్టింది. 2015 నుంచి 2019 వరకు టైం పట్టింది. కానీ ఈసారి తక్కువ సమయంలో భర్తీ చేస్తున్నాం. గ్రూప్ 2 కు పూర్తిస్థాయిలో మేము సన్నద్ధంగా ఉన్నాం. TGPSC ని, మీ మెరిట్ ను నమ్మండి.TGPSC మీ మదర్ లాంటిది.. ఎలాంటి అపోహలు లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయండి. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. 58 స్టోరేజీ పాయింట్లలో OMR షీట్లు, ప్రశ్న పత్రాలు ఉంటాయి. అభ్యర్థులకు తప్ప అందులో ఏ ప్రశ్నలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. TGPSC ప్రక్షాళన కోసం ఢిల్లీకి TGPSC సభ్యులు వెళ్తున్నారు. ఈనెల 18, 19 తేదీల్లో ఢిల్లీకి TGPSC సభ్యులు అంతా కలిసి వెళ్తున్నాం. 18న ఉదయం UPSC ఆఫీస్ లో గైడ్ లైన్స్ తీసుకుంటాం. 19 న SSC కమిషన్ ఆఫీస్ కు వెళ్తున్నాం.. సాయంత్రం NTA చైర్మన్ తో భేటీ ఉంటుంది. పారదర్శకంగా పరీక్షల నిర్వహణ కోసం అధ్యయనం చేసేందుకు వెళ్తున్నాం. జనవరి నాటికి ప్రభుత్వానికి దీనిపై నివేదిక అందజేసి తర్వాత రిక్రూట్‌మెంట్ కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాం.

కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, UP పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణలో పర్యటించనుంది. జనవరిలో వారు వచ్చే అవకాశం ఉంది. UPSC కేవలం 5 వేల అభ్యర్థుల నియామకాలపై మాత్రమే ఫోకస్ పెడుతోంది. TGPSC కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని సెక్షన్లలో నియామకాలు చేపడుతోంది.TGPSC అంటే కమిట్ మెంట్, స్పీడ్ అనేది అభ్యర్థులకు నమ్మకం కలిగేలా చూస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ లాంటి వాటిని 6 నుంచి 9 నెలల్లో పరీక్ష ప్రక్రియ పూర్తిచేస్తాం. సింగిల్ పరీక్ష ఉన్నవాటిని 6 నెలల్లోనే భర్తీ చేస్తాం. జనవరి నుంచి మార్చి మధ్యలో గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తాం. నేను ఇటీవల TGPSC చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నా. సిలబస్ మాత్రమె మేము ఇస్తాం. ఏ పుస్తకాలు చదవాలన్నది మేము చెప్పము.. అది అభ్యర్థుల ఇష్టం.. ఎందుకంటే మేము ఎలాంటి పుస్తకాలు ముద్రణ చేయడం లేదు.. ఏ పుస్తకాలు చదవాలన్నది మేము చెప్పకూడదు. కొత్త నోటిఫికేషన్లను జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసి జనవరి నాటికి కొత్త నోటిఫికేషన్ పై స్పష్టత ఇస్తాం. అరగంట ముందే గేటుకు తాళాలు వేస్తాం.. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు వెళ్లిపోవాలి. తేదీలు క్లాష్ అయితే.. 5 వేలమంది రాసే పరీక్ష కోసం 5 లక్షల మంది అభ్యర్థుల జీవితాలను ఇరకాటంలో పెట్టలేం. TGPSC చిన్న సంస్థ.. కానీ రాష్ట్రస్థాయిలో అన్ని నియామకాలు చేపట్టే సంస్థ. అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లపై స్పష్టత ఇచ్చాం. CBT పరీక్ష నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. గ్రూప్ 2 పరీక్షను కూడా CBT విధానంలో నిర్వహించవచ్చు. కానీ 28 వేల మంది రాసేందుకు మాత్రమే అవకాశం ఉంది. దీనివల్ల పరీక్షకు 25 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. మార్చి నెలాఖరులో గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తాం. TGPSC లో కొత్తగా 80 మందిని డిప్యుటేషన్ విధానంలోతీసుకుంటున్నాం

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.