
హైదరాబాద్, నవంబర్ 3: రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, బీఈడీ వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ కాలేజీలు సోమవారం (నవంబర్ 3) నుంచి మూత పడనున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయనందుకు నిరసనగా ఈ మేరకు కాలేజీల బంద్‌కు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కాలేజీలు సోమవారం నుంచి బంద్‌ను నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం నుంచే విద్యార్థులకు బంద్ కారణంగా కాలేజీలు మూతపడున్న విషయాన్ని ఆయా కాలేజీల యాజమన్యాలు సమాచారం అందించాయి. బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఏఐఎస్‌ఎఫ్ ప్రకటించింది. కాలేజీల బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం సహకరించాలని యాజమన్యాలు కోరాయి.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను సర్కారు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రైవేటు కాలేజీలు నిరవధిక బంద్ చేపడుతున్నాయి. ఫీజు బకాయిలు చెల్లించే వరకూ కాలేజీలు తెరవబోమని ప్రైవేటు విద్యా సంస్థల మేనేజ్ మెంట్ల సంఘం (ఫతీ) ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ,ఎంసీఏ, బీఈడీ.. ఇలా అన్ని రకాల కాలేజీలు ఈ రోజు నుంచి మూసివేస్తున్నారు.
కాగా గత నాలుగేళ్లుగా రూ.9 వేల కోట్ల మేర ప్రభుత్వం ఫీజు బకాయిలు పెట్టింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు వెంటనే విడుదల చేయాలని యాజమన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే కాలేజీలను నిర్వహించే పరిస్థితి లేదని, సిబ్బందికి జీతాలు కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నామని స్పష్టం చేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్ 3 నుంచి కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చినట్లు వెల్లడించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. విజిలెన్స్ దాడులు చేసినా.. వెనక్కి తగ్గబోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.