AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG DSC 2024 New Teachers: డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు.. ముగిసిన కొలువుల పండగ

తెలంగాణలో డీఎస్సీ 2024 ఉపాధ్యాయుల పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ ముగిసింది. కొత్త ఉపాధ్యాయులందరికీ నియామక పత్రాలు అందజేశారు..

TG DSC 2024 New Teachers: డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు.. ముగిసిన కొలువుల పండగ
TG DSC 2024 Postings
Srilakshmi C
|

Updated on: Oct 16, 2024 | 4:00 PM

Share

హైదరాబాద్, అక్టోబర్‌ 10: తెలంగాణలో డీఎస్సీ 2024 ఉపాధ్యాయుల పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ నేపథ్యంలో మంగళవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయ నియామక ఉత్తర్వులు అందుకున్న వారంతా మంళవారం మాన్యువల్‌ పద్ధతిలో కౌన్సెలింగ్‌ కు హాజరయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ కూడా కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఉపాధ్యాయ నియామక ఉత్తర్వులు అందుకున్న వారంతా కౌన్సెలింగ్‌ సెంటర్ల వద్దకు వచ్చారు. అయితే అనూహ్యంగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని ఉదయాన్నే విద్యాశాఖకు ఆదేశాలు రావడంతో వచ్చిన నూతన ఉపాధ్యాయులంతా వెనుదిరిగి పోయారు. ఆ తర్వాత మళ్లీ సాంకేతిక సమస్యలు తొలగడంతో.. తిరిగి మధ్యాహ్నం 2 గంటల సమయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో విద్యాశాఖ హడావిడిగా కౌన్సెలింగ్‌ మళ్లీ ప్రారంభించింది. దీంతో వెను దిరిగిన అభ్యర్ధులంతా తిరిగి కౌన్సెలింగ్‌ సెంటర్ల వద్దకు పరుగులు తీశారు. కొందరు మహిళా అభ్యర్ధులు చంటి బిడ్డలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు పడ్డారు. మొదట స్కూల్‌ అసిస్టెంట్‌, పీఈటీ, పండిట్లకు సంబంధించిన పోస్టింగ్‌లు జారీ చేశారు. ఈ ప్రక్రియ మంగళవారం రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత ఎస్‌జీటీలు, ప్రభుత్వ, లోకల్‌బాడిలకు సంబంధించిన పాఠశాలల ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ ప్రారంబించగా.. ఈ ప్రక్రియ అర్ధరాత్రి తర్వాత కూడా కొనసాగింది.

ఉపాధ్యాయ పోటీ పరీక్షలో వేల మందిని దాటుకుని బోధనను వృత్తిగా చేపట్టనున్న పలు జిల్లాలకు చెందిన కొత్త ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారుల నుంచి అక్టోబరు 15న కొలువు పత్రాలను అందుకున్నారు. నిజానికి, అక్టోబర్‌ 15వ తేదీ ఉదయం 9 గంటలకే కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో ఆలస్యమై మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైంది. దీంతో ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అక్టోబర్‌ 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతులమీదుగా ఎల్బీస్టేడియంలో నియామకపు పత్రాలు అందుకున్న వారంతా తమ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు హైదరాబాద్‌లోని స్టాన్లీ బాలికల ఉన్నతపాఠశాల, కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, శామీర్‌పేట్‌లోని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద నిర్వహించిన కౌన్సెలింగ్‌ కేంద్రాలకు కుటుంబసభ్యులతో పెద్ద ఎత్తున చేరుకున్నారు.

హైదరాబాద్‌ జిల్లాలో రాత్రి 9గంటల సమయం వరకు 400 మందికి ఇచ్చామని, 584 మందికి నియామకపు పత్రాలు ఇవ్వాల్సి ఉండగా.. వారికి కూడా అర్ధరాత్రి వరకూ నియామక పత్రాలు అందించినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో రాత్రి 334మందికిగాను 10గంటల ప్రాంతంలో 250 మందికి ఇచ్చారు. మేడ్చల్‌ జిల్లాలో 82 మందికి నియామక పత్రాలు అందించామని విద్యాశాఖ అధికారులు వివరించారు. మిగతా వారికి రాత్రి 10 గంటల తర్వాత కూడా నియామక పత్రాలు అందజేసి ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. దీంతో ఈ కౌన్సెలింగ్‌లో నూతన ఉపాధ్యాయులు అందరికీ పాఠశాలలు కేటాయించినట్లైంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.