AP Model Primary Schools: జీఓ117 రద్దు చేయనున్న కూటమి సర్కార్.. 7500 మోడల్‌ ప్రైమరీ స్కూల్స్ త్వరలో ఏర్పాటు!

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి భారీగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. దీనిలో భాగంగా గత ప్రభుత్వం తెచ్చిన జీఓ117ను కూటమి సర్కార్ రద్దు చేయనుంది. అంతేకాకుండా గత సర్కార్‌ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించిన సంగతి తెలిసిందే. వీటిని తిరిగి విలీనం చేయనుంది..

AP Model Primary Schools: జీఓ117 రద్దు చేయనున్న కూటమి సర్కార్.. 7500 మోడల్‌ ప్రైమరీ స్కూల్స్ త్వరలో ఏర్పాటు!
Model Primary Schools to AP

Updated on: Feb 03, 2025 | 12:07 PM

అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి భారీగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది. మొత్తం 7,500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇందుకోసం గత ప్రభుత్వం తెచ్చిన జీఓ117ను కూటమి సర్కార్ రద్దు చేయనుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండే ఈ పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌ చొప్పున కేటాయించనుంది. ఈ మేరకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఈ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య కనీసం 60 మంది ఉండాలనే నిబంధన పెట్టినప్పటిగకీ.. 50 మంది ఉన్నా ఆదర్శ పాఠశాలలుగానే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా గత సర్కార్‌ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించిన సంగతి తెలిసిందే.

అయితే తల్లిదండ్రుల కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు ఆ తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. పాఠశాలల మధ్య దూరం ఎక్కువగా ఉంటే బేసిక్‌ ప్రాథమిక బడులను కొనసాగించనున్నారు. దీంతో ఈ మోడల్‌ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు యథావిధిగా కొనసాగనున్నాయి. అయితే ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను కేటాయిస్తారు. జీఓ-117 రద్దు తర్వాత ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణలపై ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, గత ప్రభుత్వంలో 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో ఏకోపాధ్యాయ బడుల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 12,500లకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1,2 తరగతులు, 1 నుంచి 5 తరగతులకు ఒక్కరే టీచర్‌ ఉండటం గమనార్హం.

అలాగే ఉపాధ్యాయుల బదిలీల ముసాయిదా చట్టాన్ని విద్యాశాఖ తయారు చేసింది. ఈ ముసాయిదాను వెబ్‌సైట్‌లో పెట్టి, సూచనలు, సలహాలు ఆహ్వానించనుంది. ముసాయిదాలో పేర్కొన్న అంశాలు ఏవంటే.. రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు. 8 ఏళ్లు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. సీనియారిటీ లెక్కింపునకు అకడమిక్‌ సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.. ఈ విధంగా రూపొందించిన ముసాయిదాను ఈ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అనంతరం ఫిబ్రవరి 10లోపు ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.