Zero Rupee Note: భారతదేశంలో రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 500, రూ. 2000 వంటి వివిధ డినామినేషన్లలో కరెన్సీ నోట్లు ఉన్నాయి. అయితే ఒకప్పుడు జీరో రూపాయి నోటు కూడా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును మీరు సరిగ్గానే చదివారు. జీరో రూపాయి నోట్లు దశాబ్దానికి పైగా భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలో కరెన్సీ నోట్లను ఆర్‌బిఐ ప్రింట్ చేస్తుందని అందరికి తెలుసు. అయితే జీరో రూపాయి నోట్లను మాత్రం ఆర్‌బిఐ ముద్రించలేదు. ఎందుకో తెలుసుకుందాం.
జీరో రూపాయి నోటును తొలిసారిగా 2007లో ఫిఫ్త్ పిల్లర్ (5th pillar) అనే ఎన్జీవో ప్రవేశపెట్టింది. లంచాలను అరికట్టడానికి ప్రభుత్వ అధికారుల సంప్రదింపులతో జీరో రూపాయి నోటు ప్రవేశపెట్టారు. అవినీతి ప్రభుత్వ అధికారి లంచం అడిగినప్పుడు జీరో రూపాయి నోటు చెల్లించమని ఎన్జీవో పౌరులను ప్రోత్సహించింది. ఫిఫ్త్ పిల్లర్ తమిళనాడుకు చెందిన ఒక NGO సంస్థ. ఇది మిలియన్ల కొద్దీ జీరో రూపాయల నోటును ముద్రించింది. ఆసక్తికరంగా ఈ నోట్లను హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం వంటి వివిధ భాషలలో కూడా ముద్రించారు.
ఈ జీరో రూపాయి నోట్లను రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రకరకాల మార్కెట్లు వంటి బహిరంగ ప్రదేశాలలో ఫిఫ్త్ పిల్లర్ పంపిణీ చేసింది. అయితే ఈ జీరో నోట్లకు ఎటువంటి విలువ ఉండదు. కేవలం లంచగొండి అధికారులలో మార్పుతీసుకురావడానికి ఫిఫ్త్ పిల్లర్ సంస్థ ఇలా చేసింది. దీని తర్వాత అధికారులలో మార్పు వచ్చిందో లేదో తెలియదు కానీ ఈ నోటు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచంలో ఏ దేశంలో జరగని పని భారతదేశంలో జరగిందనే చెప్పాలి.