Tax Saving: ఒక్క రూపాయి పన్ను లేకుండా రూ. 70లక్షల రాబడి.. నెలకు రూ. 12,500 పెట్టుబడి చాలు..
ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులకైతే ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్‌వై). దీని సాయంతో అధిక రాబడితో పాటు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5లక్షల వరకూ పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. అంతేకాక దీనిలో వచ్చే వడ్డీపై కూడా పన్ను పడదు. ఇటీవల ఈ పథకం వడ్డీ రేటు కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. 8శాతం నుంచి 8.2శాతం చేసింది.

ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి డెడ్ లైన్ దగ్గరపడుతోంది. మార్చి నెలాఖరు లోపు అందరూ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ట్యాక్స్ పేయర్స్ పన్ను మినహాయింపును అందించే పథకాల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారికి ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. అయితే ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులకైతే ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్‌వై). దీని సాయంతో అధిక రాబడితో పాటు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5లక్షల వరకూ పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. అంతేకాక దీనిలో వచ్చే వడ్డీపై కూడా పన్ను పడదు. ఇటీవల ఈ పథకం వడ్డీ రేటు కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. 8శాతం నుంచి 8.2శాతం చేసింది. బహుళ ప్రయోజనాలతో కూడిన ఈ పథకం ఆడ పిల్లల తల్లిదండ్రులకు వరమని చెప్పొచ్చు. పైగా ఈ పథకంలో నెలకు రూ. 12,500 చొప్పున పెట్టుబడి మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 70లక్షలు వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..
ఇది సుకన్య సమృద్ధి యోజన పథకం..
ఈ పథకం ఆడపిల్లల కోసం తీసుకొచ్చిన పథకం. దీనిలో పెట్టుబడి పెట్టడానికి మీరు భారతీయ నివాసి అయి ఉండాలి. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయి ఉండాలి. అలాగే పదేళ్ళ లోపు ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పుట్టిన రోజు నుంచి పదేళ్ల లోపు ఆడపిల్లల పేరున ఖాతా ప్రారంభించొచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు బాలికలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మీరు పోస్టాఫీసులలో లేదా ఏదైనా బ్యాంకు శాఖలలో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. మీరు కనీసం రూ. 250 డిపాజిట్‌తో సుకన్య సమృద్ధి ఖాతాను ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ట డిపాజిట్ రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. మీకు లంప్సమ్ లేదా బహుళ వాయిదాలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై 8.2శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రతి త్రైమాసికానికి మారుతూ ఉంటుంది.
మెచ్యూరిటీ ఇలా..
ఈ పథకం ఆడపిల్లల వయసు 21 ఏళ్లు నిండిన తర్వాత మెచ్యూరిటీ సాధిస్తుంది. దీనిలో నిర్విరామంగా 15ఏళ్ల పాటు పెట్టుబడి కొనసాగించాల్సి ఉంటుంది. అయితే బాలికకు 18ఏళ్లు నిండిన తర్వాత మొత్తం పెట్టుబడిలో 50శాతంను విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. బాలికా విద్య ఖర్చుల కోసం మాత్రమే ఇది చేయడానికి అనుమతి ఉంటుంది. ఖాతా తెరిచిన ఐదు సంవత్సరాల తర్వాత, మరణం వంటి కొన్ని షరతులపై అకాల మూసివేత అనుమతించబడుతుంది. ఖాతాదారుడు, ఖాతాదారుని ప్రాణాంతక వ్యాధి లేదా ఖాతాను నిర్వహిస్తున్న సంరక్షకుని మరణం సంభవిస్తే ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. ఈ ఖాతాపై వడ్డీ క్యాలెండర్ నెలలో ఐదవ రోజు నుంచి నెలాఖరు మధ్య ఖాతాలోని అతి తక్కువ నిల్వపై లెక్కిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో వడ్డీ ఖాతాకు జమవుతుంది.
పన్ను ప్రయోజనాలు ఇలా..
సుకన్య సమృద్ధి ఖాతా ఈఈఈ (మినహాయింపు-మినహాయింపు-మినహాయింపు) కేటగిరీని పొందుతుంది. మీరు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అలాగే పథకంలో ప్రతి సంవత్సరం పొందే వడ్డీ కూడా పన్ను రహితంగా ఉంటుంది. ఇంకా మెచ్యూరిటీపై పొందే మొత్తానికి (ప్రిన్సిపాల్ + వడ్డీ)పై కూడా పన్ను ఉండదు. పాక్షిక ఉపసంహరణ కూడా పన్ను-రహితంగా ఉంటుంది.
రాబడి ఎలా ఉంటుందంటే..
ఈ పథకంలో వడ్డ రేటు ప్రతి త్రైమాసికానికి మారుతూ ఉంటుంది కాబట్టి.. మీ పెట్టుబడి మొత్తం 21 సంవత్సరాల కాలవ్యవధికి సగటున 8% పొందుతుందని అనుకుందాం . మీరు ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షలు (లేదా నెలకు రూ. 12,500) 15 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టారనుకోండి. మీ కుమార్తె 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 70 లక్షలు పొందుతుంది. మీరు ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష లేదా 15 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ. 8,333.33 పెట్టుబడి పెడితే, మీ కుమార్తె 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో రూ. 46.5 లక్షలు పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




