
వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ వస్తే అది కచ్చితంగా తెలిసిన వారి నుంచే అన్న భావన కలగడం ఖాయం. అయితే దీన్నే అదనుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీరు నమ్మదగిన వ్యక్తులుగా మెసేజ్ లు చేసి మీ నుంచి డబ్బు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ‘డబ్బు దొంగిలించే కాన్ ట్రిక్’ గా వాట్సాప్ వర్ణించింది. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ యూజర్లకు సూచిస్తోంది.
వాట్సాప్ చెప్తున్న ఈ ‘కాన్ ట్రిక్’ ఎలా ఉంటుందంటే.. ముందుగా వాట్సాప్‌లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెసేజ్ వస్తుంది. అందులో తక్షణ చర్య తీసుకోవాల్సిన లేదా ఎమర్జెన్సీ తరహా కంటెంట్ ఉంటుంది. ఉదాహరణకు మీ బంధువుల, స్నే్హితుల పేర్లు చెప్పి.. చాలా ప్రమాదంలో ఉన్నట్టు అర్జెంట్ గా డబ్బు సాయం కావాలి అన్నట్టు మెసేజ్ చేస్తారు. అలా యూజర్లను కంగారు పెట్టి డబ్బు కాజేసే ప్రయత్నం చేస్తారు. అర్జెంట్ గా ఈ లింక్ ఓపెన్ చేసి పేమెంట్ చేయమని లేదా కార్డ్ వివరాలు ఎంటర్ చేయమని అడుగుతారు. అలా చేయకపోతే పెద్ద ప్రమాదం జరుగుతుంది అన్నట్టు బిల్డప్ ఇస్తారు. ఒకవేళ వాళ్ల మాటలు నమ్మి డబ్బి పంపినా లేదా లింక్స్ ఓపెన్ చేసినా.. ఇక పూర్తిగా మోసపోయినట్టే.
ఈ తరహా మోసాల గురించి ఎక్కువ మంది వాట్సాప్ కు రిపోర్ట్ చేయడంతో వాట్సాప్ స్పందించింది. వాట్సాప్ లో గుర్తు తెలియని వ్యక్తులకు పాస్‌వర్డులు, PINలు లేదా OTPల వంటివి షేర్ చేయొద్దని సూచించింది. అలాగే ఇలాంటి స్కామ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వాట్సాప్ అకౌంట్ సేఫ్ గా ఉండాలంటే ముందుగా వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే అనుమానాస్పద మెసేజ్‌లను వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయడం మంచిది. ఒకవేళ మీకు తెలిసిన వాళ్లు అన్న అనుమానం ఉంటే కాల్ చేసి నిర్థారించుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.