
సో.. గోల్డ్ లాగే.. వెండి ధర కూడా ఎప్పటి నుంచి భారీగా పెరుగుతోందా అని చూస్తే.. 2020 జనవరి నుంచి 2025 సెప్టెంబర్ మధ్య పెరిగింది. 2020లో కేజీ వెండి ధర దాదాపు 40 వేల రూపాయిలు. అదే ఇప్పుడు చూస్తే.. కేజీ వెండి ధర లక్షా 51 వేలు. అంటే కేవలం ఐదేళ్లలో రెండు రెట్లు దాటి పెరిగింది. సో.. దీనిని బట్టి చూస్తే.. పసిడి కానీ, వెండి కానీ.. వెలుగులు విరజిమ్మడంలో పోటీ పడ్డాయని అర్థమవుతోంది.
అగ్రరాజ్యంలో వడ్డీ రేట్లు తగ్గినా, డాలర్ వీక్ అయినా ఆటోమేటిగ్గా పెట్టుబడులన్నీ గోల్డ్ మార్కెట్ వైపు వచ్చేస్తాయి. దీనికి తగ్గట్టే.. చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. ఇక వెండికి డిమాండ్ పెరగడానికి కారణాలున్నాయి. సాధారణంగా వెండిని వస్తువుల రూపంలో ఎక్కువగా కొనుగోలు చేయడం మనవారికి అలవాటు. వెండి కంచాలు, దేవుని పూజా సామగ్రి.. ఇలా వివిధ రూపాల్లో కొంటుంటారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ వెండిపై ఫోకస్ పెట్టాయి. మెడికల్ ఎక్విప్ మెంట్ తో పాటు ఎలక్ట్రానిక్స్ లోనూ దీనిని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఈ లోహానికి డిమాండ్ పెరిగింది. ఒక్క ఉదాహరణ చెబుతాను. దానిని బట్టి వెండి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది.
ఈ ఏడాది జనవరి నుంచి లెక్క చూస్తే.. గోల్డ్ రేటు ఎంత పెరిగిందో తెలుసా..యాభై ఒక్క శాతం పైగా పెరిగింది. ఇక వెండి ధర అయితే 67 శాతం పెరిగింది. అంటే బంగారంతో పోలిస్తే వెండి రేటు పెరుగుదలే ఎక్కువగా పెరిగింది. దీనిని బట్టి వెండికి గిరాకీ ఎలా ఉందో.. భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమై ఉంటుంది. దీని వృద్ధి ఇలాగే ఉంటే.. వచ్చే 12 నుంచి 24 నెలల్లోనే కేజీ వెండి ధర 2 లక్షల రూపాయిలకు చేరుకునే ఛాన్స్ ఉంది. వెండి నాణేలు, వెండి కడ్డీలు, వెండి ఆభరణాలు.. ఇలా వీటిలో పెట్టుబడులు పెట్టవచ్చంటున్నారు నిపుణులు. అటు బంగారానికి కూడా డిమాండ్ ఇలానే ఉంటే.. వచ్చే ఐదేళ్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర దాదాపు రెండు లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
గోల్డ్ రేటు పెరుగుతోంది. అలా అని కొనకుండా ఉండలేరు. ఎందుకంటే అది భారతీయుల జీవితంలో చాలా సందర్భాల్లో ముడిపడి ఉంటుంది. అందుకే ఇక 24, 22 క్యారెట్ల తో పాటు అంతకన్నా తక్కువగా ఉండే 18 క్యారెట్ల గోల్డ్ కు కూడా ఇక డిమాండ్ పెరగవచ్చు. 18 క్యారెట్ల గోల్డ్ అంటే.. ఇందులో 75 శాతం బంగారం ఉంటుంది. మిగిలిన 25 శాతం ఇతర లోహాలు ఉంటాయి. దీని రేటు తక్కువే. బడ్జెట్ లో వస్తుంది కాబట్టి.. శుభకార్యాలకు, ఆభరణాలకు.. దీనివైపు మొగ్గు చూపవచ్చు అని అంచనా వేస్తున్నారు.
గోల్డ్ రేటు ఇలా ఉండేసరికీ దానిని కొనడానికి జనం భయపడుతున్నారు. రేటు పెరగడంతో.. కొనడం మాట అటుంచి తాకట్టు పెట్టడానికి మొగ్గుచూపుతున్నారు. సులువుగా అప్పు లభిస్తుండేసరికీ గోల్డ్ తనఖా మార్కెట్ పెరుగుతోంది. పైగా ఇంట్లో ఆర్థిక అవసరాలకు వేగంగా అప్పు చేయాలంటే.. సులువుగా కనిపించేది బంగారమే. ఇక పాత నగలను మార్చుకుని.. దానికి మరికొంత గోల్డ్ కలిపి.. కొత్త నగలను చేయించుకోవాలనుకునే వారి సంఖ్యా పెరుగుతోంది. ఎటు చూసినా కొత్తగా బంగారం కొనడం కన్నా.. ఉన్న బంగారాన్ని అప్పు చేయడానికో.. మార్పిడి చేసుకోవడానికో ఉపయోగించుకోవాలనుకునేవారు పెరుగుతున్నారు. ఇక్కడ మీకో లెక్క చెబుతాను. బంగారం తనఖా రుణాల మార్కెట్.. కిందటేడాది.. అంటే 2024 జూలై నాటికి లక్షా 32 వేల కోట్ల రూపాయిలుగా ఉంది. అదే ఈ ఏడాది.. అంటే 2025 జూలై నాటికి రెండు లక్షల 94 వేల కోట్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే ఈ మార్కెట్ 122 శాతం పెరిగింది. దీనిని బట్టి పరిస్థితి మీకు అర్థమై ఉంటుంది.
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర లక్ష దాటేసింది. దీంతో బ్యాంకులు కూడా గ్రాముకు సుమారు ఏడు వేల రూపాయిల రుణం ఇస్తున్నాయి. అందుకే వీటివైపు ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. కేవలం ఇంటి అవసరాల కోసమే కాదు.. చిన్న బిజినెస్ చేసేవారు, వ్యవసాయదారులు, బిజినెస్ మెన్.. ఇలా వ్యాపార వర్గాలు కూడా గోల్డ్ లోన్ వైపే మొగ్గుచూపుతున్నాయి. బంగారం రేటు పెరగడమే ఈ రుణాల మార్కెట్ వృద్ధికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
చివరిగా చెప్పేది ఒక్కటే.. గోల్డ్ అయినా, సిల్వర్ అయినా.. ఏదో ఒకదానిలో పెట్టుబడి పెట్టడం మంచిదే. ఎందుకంటే.. కరోనా సృష్టించిన అల్లకల్లోలం తరువాత ఈ రెండు లోహాల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అందుకే భవిష్యత్ పెట్టుబడి కోసం అయినా వీటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. భౌతికంగా వీటిని కొనలేకపోయినా.. గోల్డ్ ఈటీఎఫ్ లు, డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా కొనవచ్చంటున్నారు. అన్నట్టు భారతీయుల దగ్గర ఉన్న మొత్తం బంగారం ఎంతో తెలుసా? దాదాపు 24 వేల టన్నులు. దీనిని బట్టి మనవాళ్లు బంగారానికి ఎంత ప్రయార్టీ ఇస్తారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.