స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసా..?
వారెన్ బఫెట్ యొక్క 90/10 పెట్టుబడి నియమం, సామాన్య ఇన్వెస్టర్లకు సంపద సృష్టించడానికి ఒక సులభ మార్గం. అధిక ఫీజులు వసూలు చేసే ఫండ్ మేనేజర్ల కంటే ఈ సరళమైన పద్ధతే దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలను ఇస్తుందని బఫెట్ గట్టిగా నమ్ముతారు. ఇక్కడ మీరు మేధావి అవ్వాల్సిన పని లేదు.. కేవలం క్రమశిక్షణ, ఓపిక ఉంటే చాలు. అసలు ఆ నియమం ఏంటీ..? అనేది తెలుసుకుందాం..

స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి అదో జూదం.. పెట్టిన డబ్బులన్నీ పోతాయి అనే భయం ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ మాత్రం.. పెట్టుబడి పెట్టడం అనేది ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని అని చెబుతున్నారు. సంక్లిష్టమైన లెక్కలు, రోజూ మార్కెట్ ఛార్టులు చూడాల్సిన అవసరం లేకుండానే సంపదను ఎలా సృష్టించవచ్చో ఆయన ఒక సింపుల్ సూత్రం ద్వారా వివరించారు. అదే 90/10 నియమం. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా సామాన్య ఇన్వెస్టర్లకు ఒక వరంగా మారింది.
ఏమిటి ఈ 90-10 నియమం?
వారెన్ బఫెట్ తన భార్య కోసం తన వీలునామాలో రాసిన సలహా ఇది. మీరు పెట్టుబడి పెట్టాలనుకునే సొమ్మును రెండు భాగాలుగా విడదీయడమే ఈ నియమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. మీ వద్ద ఉన్న మొత్తంలో 90 శాతాన్ని తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మిగిలిన 10 శాతం డబ్బును రిస్క్ లేని ప్రభుత్వ బాండ్లలో ఉంచాలి.
ఈ పద్ధతి ఎందుకు అంత పక్కాగా పనిచేస్తుంది?
సాధారణంగా ఏ కంపెనీ షేర్లు పెరుగుతాయో, ఏవి పడిపోతాయో అంచనా వేయడం నిపుణులకే సాధ్యం కాదు. కానీ ఇండెక్స్ ఫండ్ ద్వారా మీరు దేశంలోని టాప్ 500 లేదా టాప్ 50 కంపెనీల సమూహంలో పెట్టుబడి పెడతారు. ఒక కంపెనీ నష్టపోయినా.. మరో కంపెనీ లాభాల బాటలో ఉంటుంది. దేశం అభివృద్ధి చెందుతున్నంత కాలం మీ డబ్బు కూడా పెరుగుతూనే ఉంటుంది. 10 శాతం ప్రభుత్వ బాండ్లలో ఉంచడం వల్ల మార్కెట్ అకస్మాత్తుగా పడిపోయినా లేదా మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైనా ఆ 10 శాతం మొత్తం మీకు రక్షణ కవచంలా నిలుస్తుంది.
బఫెట్ చెప్పే మ్యాజిక్ సీక్రెట్
అధిక ఫీజులు వసూలు చేసే ఫండ్ మేనేజర్ల కంటే ఈ సరళమైన పద్ధతే దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలను ఇస్తుందని బఫెట్ గట్టిగా నమ్ముతారు. ఇక్కడ మీరు మేధావి అవ్వాల్సిన పని లేదు.. కేవలం క్రమశిక్షణ, ఓపిక ఉంటే చాలు. మీరు పెట్టిన పెట్టుబడి దీర్ఘకాలంలో వడ్డీ మీద చక్రవడ్డీని పొందుతూ అనేక రెట్లు పెరుగుతుంది.
భారత్‌కు ఇది ఎలా వర్తిస్తుంది?
ఈ వ్యూహం అమెరికా మార్కెట్ కోసం చెప్పినప్పటికీ, భారత్‌లోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిలో 90 శాతాన్ని నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్‌లో, 10 శాతాన్ని ప్రభుత్వ గోల్డ్ బాండ్లు లేదా డెట్ ఫండ్లలో పెట్టుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




