Telangana: తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎక్కడంటే..?
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ రానుంది. అదే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్. త్వరలోనే దీనికి శంకుస్థాపన జరిపేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి కీలక ప్రకటన వచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని స్ఫష్టం చేసింది.

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ రానుంది. అదే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై ఎప్పటినుంచో చర్చలు సాగుతున్నాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక దీనిపై మరింత కసరత్తు పెంచింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం స్టార్ట్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై తాజాగా కీలక అప్డేట్ లభించింది. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు అడిగిన ప్రశ్నలకు మురళీథర్ మొహోల్ రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు.
అనుమతులు జారీ
ఈ సందర్బంగా వరంగల్ ఎయిర్‌పోర్టుకు రూ.496.86 కోట్ల అంచనా వ్యయంతో సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసినట్లు మురళీధర్ మొహోల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ, అవసరమైన చట్టబద్దమైన అనుమతులు, మౌలిక సదుపాయాలు వేగంగా చేపడితే ఎయిర్ పోర్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని చెప్పారు. త్వరలోనే ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన పనులు చేపడతామని అన్నారు. అటు ఆదిలాబాద్‌తో పాటు పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ ఎయిర్‌పోర్టుల కోసం ప్రతిపాదనలు వచ్చాయని, వీటిని పరిశీలిస్తున్నామన్నారు. ఆదిలాబాద్‌లో ఉన్న ఎయిర్‌ఫీల్డ్‌ను సివిల్, మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించుకునే అంశంపై ఏఏఐ అధ్యయనం చేస్తోందన్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు కావాల్సిన అదనపు భూమికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఏఏఐ పంపిందని స్పష్టం చేశారు.
త్వరలోనే శంకుస్థాపన
అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం, చెంచుపల్లి, సుజాత నగర్ గ్రామల పరిధిలో ప్రతిపాదించిన భూమిలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం సాధ్యపడదని కేంద్రం తెలిపింది. ఈ స్థలానికి సమీపంలో రైల్వే లైన్లు, కొండలు ఉండటం వల్ల ఫ్లైట్ ల్యాండింగ్, టేకాఫ్‌లకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వేగంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి వరంగల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కాకతియ స్ట్రైల్లో ఎయిర్‌పోర్డ్ డిజైన్ చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 58 విమాన మార్గాలు అందుబాటులోకి వచ్చాయని, వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
