
ప్రస్తుతం ఉన్న వాహనాలు హారన్లు చెవులకు చిల్లులు పడే విధంగా శబ్దాలు చేస్తున్నాయి. వాటి వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు శబ్దకాలుష్యం కూడా ఏర్పడుతోంది. అందుకే ఆ హారన్ సౌండ్ల స్థానంలో మన సంగీత పరికరాలైన తబలా, వయోలిన్, ఫ్లూట్, హార్మోనియం వంటి వాయిద్యాల శబ్దాలను పరిశీలిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. తొలి దశలో కార్లలో ఈ కొత్త ప్రతిపాదనను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు త్వరలోనే కార్లు తయారీదారులతో ప్రత్యేక సమావేశమై చర్చించనున్నట్లు వివరించారు.
మన దేశంలో ఆటోమోబైల్ మార్కెట్ రోజుకీ రోజుకీ విస్తరిస్తోంది. 2014లో రూ. 14లక్షల కోట్లు ఉన్నమార్కెట్ వాల్యూ.. ఇప్పుడు రూ. 22లక్షల కోట్లకు చేరుకుంది. దీని సాయంతో జపాన్ ని కూడామనం బీట్ చేసి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమోబైల్ మార్కెట్ గా అవతరించాలమని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు. తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగం గణనీయంగా పెరగడంతో పాటు వాటి ఎగుమతులు కూడా అధికమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో శబ్దకాలుష్యం కూడా గణనీయంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో పరిస్థితి చేయిదాటిపోతోంది. దీని కారణంగా జనాలకు పలు రోగాలు కూడా చుట్టుముడుతున్నాయి. కర్ణభేరి దెబ్బతిని వినికిడి శక్తి లోపిస్తోంది, మానసిక ఆందోళన, ఒత్తిళ్లు, గుండె సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి ఎయిర్ హారన్లు అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులపై మాత్రమే వినియోగించాల్సి ఉన్నా.. సిటీ పరిధిలో కూడా ఇష్టానుసారం వాడుతున్నారు. దీని వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఈ అవస్థలను దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి