IPO: ఐపీఓ మార్కెట్ బాటలో మరో టాప్ కంపెనీ…మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్న నిర్ణయం
భారతదేశంలోని ప్రముఖ కంపెనీ తమ సేవలను విస్తరించేందుకు పెట్టుబడిదారులను పెట్టుబడులను కోరుతున్నారు. ఇంట్లో దాదాపు అన్ని రకాల సేవలను అందించే సంస్థ అయిన అర్బన్ కంపెనీ ఇటీవల రూ.1,900 కోట్ల ఐపీఓ కోసం డీఆర్‌హెచ్‌పీ (డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్)ను దాఖలు చేసింది.

అర్బన్ కంపెనీ పెట్టిన ఈ ప్రతిపాదన కారణంగా ఆక్సెల్, ఎలివేషన్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, వై-క్యాపిటల్ వంటి కంపెనీ పెట్టుబడిదారులు తమ వాటాలను విక్రయిస్తున్నందున ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.429 కోట్ల కొత్త ఇష్యూ, రూ.1,471 కోట్ల సెకండరీ షేర్ అమ్మకం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అర్బన్ కంపెనీ కొత్త టెక్నాలజీ అభివృద్ధితో పాటు క్లౌడ్ మౌలిక సదుపాయాల కోసం కంపెనీ రూ.190 కోట్లు ఖర్చు చేయనుంది. మిగిలిన డబ్బును ఆఫీస్ రెంట్, మార్కెటింగ్ కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టనుంది. గతంలో అర్బన్ కంపెనీ రూ.3,000 కోట్ల ఐపీఓ తీసుకురాబోతుందని వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ ఇప్పుడు దానిని రూ.1,900 కోట్లకు తగ్గించారు.
ఈ ఐపీఓ కోసం అర్బన్ కంపెనీ కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాచ్స్, జేఎం ఫైనాన్షియల్‌లను తన బ్యాంకర్లుగా నియమించింది. ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిరాజ్ సింగ్ భాల్, వరుణ్ ఖైతాన్, రాఘవ్ చంద్ర, కంపెనీలో దాదాపు 21 శాతం వాటాను కలిగి ఉన్నారు. వారు ఈ ఐపీఓలో తమ వాటాను విక్రయించడం లేదు. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో అర్బన్ కంపెనీ రూ. 846 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం కంటే 41% ఎక్కువగా ఉంది. ఈ కాలంలో కంపెనీ రూ.242 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా గత ఏడాది ఇదే సమయానికి రూ.58 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
దేశీయ సేవలతో పాటు కంపెనీ డైరెక్ట్-టు-కన్జ్యూమర్ విభాగంలోకి కూడా ప్రవేశించింది. వారు తమ సొంత నీటి శుద్ధీకరణ యంత్రాలు, స్మార్ట్ లాక్‌లను ప్రారంభించారు. మార్చిలో వారు 15 నిమిషాల్లో ఇళ్ల సర్వీసులను బుక్ చేసుకునేందుకు వినియోగదారులను అనుమతించే కొత్త సేవను ప్రారంభించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








