AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో వినిపించే ముఖ్యమైన పదాలు – వాటి అర్థాలు ఇవిగో..

Budget Glossary: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వార్షిక బడ్జెట్‌ (Union Budget 2026)ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో వాడే కొన్ని ముఖ్యమైన పదాలు చాలా మందికి తెలీదు. బడ్జెట్‌ను లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆ పదాల అర్థం ఏంటో ముందే తెలుసుకుని ఉండటం ఎంతో ముఖ్యం. మరి ద్రవ్య లోటు, రెవెన్యూ ఖర్చు వంటి ముఖ్యమైన పదాలకు అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో వినిపించే ముఖ్యమైన పదాలు – వాటి అర్థాలు ఇవిగో..
Union Budget 2026
Janardhan Veluru
|

Updated on: Jan 14, 2026 | 4:44 PM

Share

అంతర్జాతీయ విపణిలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న కేంద్ర వార్షిక బడ్జెట్‌ 2026-27ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది నిర్మలా సతీరామాన్ సమర్పించనున్న ఎనిమిదో బడ్జెట్ కావడం విశేషం. ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, మూలధన వ్యయం తదితర ఆర్థిక అంశాలకు సంబంధించిన ముఖ్యమైన పదాలు ప్రస్తావనకు రానున్నాయి. వార్షిక బడ్జెట్‌ను లోతుగా అర్థంచేసుకోవాలంటే మీరు ముందుగానే ఈ పదాలకు అర్థాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. త్వరలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ.. బడ్జెట్‌లో ప్రస్తావనకు వచ్చే సదరు ముఖ్యమైన పదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బడ్జెట్ (Budget)

కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే ఆదాయం – ఖర్చుల ప్రణాళిక.

ఆర్థిక సంవత్సరం (Financial Year)

ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే సంవత్సరం.

రెవెన్యూ ఆదాయం (Revenue Receipts)

పన్నులు, ఫీజులు, వడ్డీలు లాంటి రోజువారీ ఆదాయాలు.

రెవెన్యూ ఖర్చు (Revenue Expenditure)

జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు లాంటి నిత్య ఖర్చులు.

క్యాపిటల్ ఆదాయం (Capital Receipts)

రుణాలు, ఆస్తుల అమ్మకం ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బు.

క్యాపిటల్ ఖర్చు (Capital Expenditure)

రోడ్లు, రైల్వేలు, భవనాలు లాంటి అభివృద్ధి పనులకు ఖర్చు.

ఫిస్కల్ డెఫిసిట్ (Fiscal Deficit)

ప్రభుత్వ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైతే వచ్చే లోటు.

రెవెన్యూ డెఫిసిట్ లేదా ద్రవ్య లోటు (Revenue Deficit)

రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ ఖర్చు ఎక్కువ అయినప్పుడు వచ్చే లోటు

ప్రైమరీ డెఫిసిట్ (Primary Deficit)

వడ్డీ ఖర్చు మినహాయించి మిగిలిన లోటు

ప్రత్యక్ష పన్ను (Direct Tax)

నేరుగా చెల్లించే పన్నులు ( ఉదాహరణ: ఇన్‌కమ్ ట్యాక్స్)

పరోక్ష పన్ను (Indirect Tax)

వస్తువులపై వేయబడే పన్నులు ( ఉదాహరణ: GST)

సబ్సిడీ (Subsidy)

ప్రజలకు తక్కువ ధరలకు వస్తువులు అందించేందుకు ప్రభుత్వం ఇచ్చే సహాయం.

డిస్ఇన్వెస్ట్‌మెంట్ (Disinvestment)

ప్రభుత్వ సంస్థల్లో వాటా విక్రయం

బేస్ ఇయర్ (Base Year)

ద్రవ్యోల్బణం లెక్కించడానికి తీసుకునే ప్రామాణిక సంవత్సరం.

స్థూల దేశీయోత్పత్తి (GDP)

దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విలువ.

వార్షిక ఆర్థిక నివేదిక (Annual Financial Statement)

ప్రభుత్వం డబ్బును ఎలా సంపాదిస్తుంది, ఎలా ఖర్చు చేస్తుంది అనే విషయాలను స్పష్టంగా వివరించే నివేదిక. ఇది యూనియన్ బడ్జెట్‌కు హృదయం లాంటిది.

ఆర్థిక సర్వే (Economic Survey)

బడ్జెట్‌కు ముందుగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం విడుదల చేసే ఒక ముఖ్యమైన నివేదికనే ఎకనామిక్ సర్వే. ఇది గత ఏడాది ఆర్థిక పరిస్థితులను సమీక్షించి.. తదుపరి బడ్జెట్‌ నిర్ణయాలకు మార్గదర్శకం చేస్తుంది.

సెస్ (Cess)

ఇప్పటికే ఉన్న పన్నులపై అదనంగా వసూలు చేసే ప్రత్యేక పన్ను. ప్రత్యేక పనులు (ఉదా: విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు) కోసం ఈ అదనపు పన్ను వసూలు చేస్తారు.

సర్‌చార్జ్ (Surcharge)

సర్‌చార్జ్ అనేది ఇప్పటికే ఉన్న పన్నుపై అదనంగా వసూలు చేసే పన్ను. ప్రభుత్వానికి అదనపు ఆదాయం కోసం ఎక్కువ ఆదాయం ఉన్న వారు, కంపెనీలపై ఈ పన్ను విధిస్తారు.

బడ్జెట్ ఎస్టిమేట్ (Budget Estimate)

రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖలకు, ప్రభుత్వ విభాగాలకు, రంగాలకు, సంక్షేమ పథకాలకు ఎంత నిధులు కేటాయించాలని ప్రభుత్వం ముందుగా చేసే అంచనా.

ఫైనాన్స్ బిల్ (Finance Bill)

రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త పన్నుల ప్రతిపాదనలు, ఉన్న పన్ను చట్టాల్లో మార్పులు వివరంగా పొందుపరిచే బిల్లు ఇది. దీన్ని బడ్జెట్ సమయంలో లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారుతుంది.

ద్రవ్యోల్బణం (Inflation)

వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరుగుతున్న రేటునే ద్రవ్యోల్బణం అంటారు. దీని వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది.

రిబేట్ (Rebate)

పన్ను చెల్లించాల్సిన వ్యక్తికి ప్రభుత్వం కొంత మొత్తాన్ని తగ్గించి ఆర్థిక భారం తగ్గించేందుకు ఇచ్చే రాయితీనే రిబేట్ అంటారు.

పన్ను మినహాయింపు (Tax Deduction)

అర్హత కలిగిన పెట్టుబడులు లేదా ఖర్చుల ఆధారంగా పన్ను లెక్కించే ఆదాయాన్ని తగ్గించే ప్రయోజనాన్నే పన్ను మినహాయింపు అంటారు.