Gold: ప్రపంచంలోనే ఎక్కువ బంగారం ఏ దేశం వద్ద ఉందంటే..? భారత్ స్ధానం ఇదిగో..
ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వంలో బంగారు నిల్వలు కీలక పాత్ర పోషిస్తాయి. అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, చైనా, రష్యా, స్విట్జర్లాండ్, భారతదేశం, జపాన్, పోలాండ్ అత్యధిక బంగారాన్ని కలిగి ఉన్నాయి. ప్రభుత్వాల వద్ద అధికారికంగా ఉన్న బంగారు నిల్వల ఆధారంగా ప్రపంచంలోని టాప్-10 దేశాలు చూద్దాం.

ఒక దేశ ఆర్థిక స్థిరత్వం, సంపదను అంచనా వేయడంలో బంగారు నిల్వలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వాల వద్ద అధికారికంగా ఉన్న బంగారు నిల్వలు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక మద్దతుగా నిలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు గణనీయమైన బంగారాన్ని తమ నిల్వలుగా కలిగి ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం చాలా కాలంగా ఒక కీలక భాగంగా ఉంది. అనిశ్చిత పరిస్థితులలో ఆదుకునే రక్షణాత్మకమైన పెట్టుబడిగా బంగారాన్ని చాలామంది భావిస్తారు. సంపదను నిలువ చేసుకునే మార్గంగాను పరిగణిస్తారు. భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు.. అది ఒక సెంటిమెంట్. దేశంలో చాలా కుటుంబాల్లో పొదుపు, ఖర్చుల్లో బంగారం కీలకమైనది కావడంతో ప్రపంచ అతిపెద్ద బంగారం మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన టాప్-10 దేశాలను పరిశీలిద్దాం.
జూన్ 2026 వరకు ఉన్న డేటా ప్రకారం అమెరికా వద్ద 8133.46 టన్ను బంగారం ఉంది. దీంతో బంగారం నిల్వల్లో ప్రపంచంలోనే అమెరికా తొలి స్థానంలో ఉంది. ఇక ఇటలీ 2451.84 టన్నులతో రెండో స్థానంలో ఉండగా.. చైనా 2346.43 టన్నులతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత రష్యా 2282.98 టన్నులతో నాలుగో స్ధానంలో కొనసాగుతోండగా.. స్విట్జర్లాండ్ 1039.94 టన్నులతో ఐదో స్థానంలో ఉంది. ఇక ఇండియా 880.51 టన్నులతో ఆరో స్ధానంలో ఉండగా.. జపాన్ 845.97 టన్నులు, పోలండ్ 632.43 టన్నులు, టర్కీ 530.62 టన్నులు, ఉజ్బెకిస్థాన్ 431.71 టన్నులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) డేటా ప్రకారం చూస్తే.. కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నాయని చెప్పవచ్చు. 2026 ఆగస్టులో ప్రపంచ కేంద్ర బ్యాంకులు నికరంగా 39 టన్నుల మేర బంగారం కొనుగోలు చేసినట్లు ఈ రిపోర్టులో వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణించి తమ నిల్వలను పెంచుకుంటున్నాయి. అయితే ప్రభుత్వ నిల్వలకు భిన్నంగా భారతీయ ప్రజల దగ్గర అపారమైన పసిడి సంపద ఉంది. సుమారు 24,000 టన్నుల బంగారం భారతీయ కుటుంబాల ఇళ్లల్లో నిల్వ ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యధికం. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. ఈ పసిడి విలువ దాదాపు 3.8 ట్రిలియన్ డాలర్లుజజ ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 87.8 శాతానికి సమానం. ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరగడం, గతేడాది పసిడిపై మంచి రాబడి రావడంతో ప్రజల కొనుగోలు తీరులో మార్పు వచ్చింది. ఆభరణాల రూపంలో కాకుండా బిస్కెట్లు, నాణేల రూపంలో పసిడిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఆభరణాల పరిమాణం 24 శాతం తగ్గి 430.5 టన్నులకు పడిపోగా, కడ్డీలు, నాణేల డిమాండ్ 17 శాతం పెరిగి 280.4 టన్నులకు చేరింది.
