Tata Nano: నానో కారు తయారీకి అసలు కారణం ఇదా.. రతన్ టాటాకు హేట్సాఫ్ చెప్పాల్సిందే..

| Edited By: TV9 Telugu

Oct 14, 2024 | 6:38 PM

టాటా నానో కారును తయారు చేయడం వెనుక బలమైన కారణం ఉంది. దాని గురించి 2022లో రతన్ టాాటా తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. ఆయన నిత్యం వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ద్విచక్ర వాహనాలపై వెళుతున్న కుటుంబాలను చేసేవారు. ఒకే బండిపై తల్లి, తండ్రి, పిల్లలు ప్రయాణించేవారు. చాలా ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు పడుతూ వెళ్లేవారు.

Tata Nano: నానో కారు తయారీకి అసలు కారణం ఇదా.. రతన్ టాటాకు హేట్సాఫ్ చెప్పాల్సిందే..
Ratan Tata Nano Car
Follow us on

రతన్ టాటా పేరు వినగానే భారతీయులందరి మదిలో ఆత్మీయత ఉప్పొంగుతుంది. దేశంలో ఎంత మంది పారిశ్రామిక వేత్తలు ఉన్నా రతన్ టాటా పేరు మాత్రం ప్రతి ఒక్కరికి సుపరిచితం. సాధారణంగా వ్యాపారవేత్తలు తమ లాభాలకు ప్రాధాన్యం ఇస్తారు. దానికి అనుగుణంగానే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తారు. కానీ రతన్ టాటా అందుకు పూర్తి విభిన్నంగా వ్యవహరించేవారు. లాభాపేక్షతో కాకుండా ప్రజల అవసరాలు తీర్చడానికి ఎక్కువ ఆలోచించేవారు. ఈ ఆలోచనా విధానం, నిరాడంబర జీవన శైలి ఆయనను దేశంలోని సామాన్య ప్రజలకు దగ్గర చేసింది. సామాన్య ప్రజలు బాగుండాలని, వారు సుఖంగా జీవించాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. దానికి నానో కారు ఆవిష్కరణే గొప్ప ఉదాహరణ. దాన్ని మార్కెట్ లోకి తీసుకురావడానికి ఆయన అనేక ఇబ్బందులు పడ్డారు. నష్టాలను కూడా చవిచూశారు. అయినా ఇచ్చిన మాట ప్రకారం నానో కారును అందుబాటులోకి తీసుకువచ్చారు.

లక్ష రూపాయలకే కారు..

సంపన్న కుటుంబాల వారికి మాత్రమే కారు అందుబాటులో ఉంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు దాని గురించి ఆలోచించే అవకాశం కూడా లేదు.. ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చుచేసి కారును కొనుగోలు చేసే స్థాయి మధ్య తరగతి కుటుంబాలకు ఉండదు. అయితే సామాన్య, మధ్య తరగతి ప్రజల కోసం కేవలం ఒక లక్ష రూపాయలకే నానో కారును రతన్ టాటా తీసుకువచ్చారు. సామాన్యులు కూడా తమ కుటుంబంతో కారులో తిరిగి అవకాశం కల్పించారు. 2009లో టాటా నానో కారు మార్కెట్ లోకి విడుదలై సంచలనం రేపింది.

లాభాపేక్ష లేకుండా..

టాటా నానో కారును తయారు చేయడం వెనుక బలమైన కారణం ఉంది. దాని గురించి 2022లో రతన్ టాాటా తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. ఆయన నిత్యం వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ద్విచక్ర వాహనాలపై వెళుతున్న కుటుంబాలను చేసేవారు. ఒకే బండిపై తల్లి, తండ్రి, పిల్లలు ప్రయాణించేవారు. చాలా ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు పడుతూ వెళ్లేవారు. సాధారణంగా మోటారు సైకిల్ ఇద్దరికి మాత్రమే సౌకర్యంగా ఉంటుంది. కానీ మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు కారు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. దీంతో తప్పని పరిస్థితుల్లో వారు ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తారు. వర్షం కురిసినా, అనుకోకుండా బండి జారీ పడినా పెద్ద ప్రమాదం జరుగుతుంది. దీంతో రతన్ టాటా మదిలో ఆలోచన మెదిలింది. సామాన్యుల కోసం కారు తయారు చేయాలని, అది కూడా వారికి అందుబాటులో ధరలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే లాభాపేక్ష లేకుండా ప్రజలకు సౌకర్యంగా ఉండే కారును రూపొందించాలనుకున్నారు. ఆ ఆలోచనే నానో కారు ఆవిర్భావానికి నాంది పలికింది.

అనేక వివాదాలు..

నానో కారు ప్రాజెక్టు గురించి రతన్ టాటా ప్రకటన చేసిన నాటి నుంచే అనేక వివాదాలు, సందేహాలు చుట్టుముట్టాయి. లక్ష రూపాయలకే కారును ఎలా తయారు చేస్తారంటూ అనేక మంది ప్రశ్నలు వేశారు. మొదట్లో నానో కారు ఉత్పత్తి పశ్చిమ బెంగాల్ లో చేపట్టాలనుకున్నారు. పరిశ్రమ కోసం అప్పటి వామపక్ష ప్రభుత్వం భూ కేటాయింపులు కూడా జరిగింది. అయితే మమతా బెనర్జీ ఉద్యమం నడిపారు. దీంతో కారు ప్రాజెక్టు గుజరాత్ కు మార్చాల్సి వచ్చింది.

నానో విడుదల..

నోనా కారును 2008లో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించారు. అనంతరం 2009లో మార్కెట్ లోకి విడుదల చేశారు. దీని తయారీ వల్ల నష్టం వస్తుందని తెలిసినా భరించడానికి రతన్ టాటా సిద్ధపడ్డారు. అలా 2.75 లక్షల యూనిట్లను టాటా గ్రూపు విక్రయించింది. రతన్ టాటా ఎన్నో కష్టాలు, నష్టాలు భరించి విడుదల చేసిన నానో కారు పూర్తిస్థాయిలో ప్రజలకు వద్దకు వెళ్లలేదు. దీనికి కారణంగా అది చీపెస్ట్ కారు అని ముద్ర పడడమే. ఈ విషయాన్ని రతన్ టాటా స్వయంగా తెలిపారు. తాను చౌకైన కారును రూపొందించ లేదని, సామాన్యుల ప్రయాణానికి సురక్షితమైన కారును తయారు చేసినట్టు వెల్లడించారు. నానో కారు ప్రస్థానం 2019లో ముగిసింది. అయితే ఇచ్చిన మాటను నిలుపుకొన్న వ్యక్తిగా రతన టాటా గౌరవం దక్కించుకున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..