AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar Update: ఆధార్ వివరాల అప్‌డేట్‌కూ రూల్స్ ఉన్నాయ్.. ఏది ఎన్నిసార్లు అప్‌డేట్ చేయొచ్చో తెలుసా?

ఆధార్ కార్డులో వివరాలను సరిచేసుకోవడానికి, తప్పులు లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఆధార్ కేంద్రాలకు వెళ్లి లేదా ఆన్ లైన్ లో తప్పులను సరిచేసుకోవచ్చు. కానీ మీ ఆధార్ కార్డులో ఏ వివరాలను ఎన్నిసార్లు అప్ డేట్ చేసుకోవచ్చు? వాటికి ఉన్న నిబంధనలు ఏమిటి? ఆ వివరాలను తెలుసుకుందాం రండి..

Aadhar Update: ఆధార్ వివరాల అప్‌డేట్‌కూ రూల్స్ ఉన్నాయ్.. ఏది ఎన్నిసార్లు అప్‌డేట్ చేయొచ్చో తెలుసా?
Aadhar Card
Madhu
|

Updated on: Apr 12, 2024 | 3:41 PM

Share

జీవితంలో ఏ పనిచేయాలన్నా ఆధార్ కార్డు చాలా అవసరం. దానివల్ల దేశ పౌరులుగా మనకు గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ పథకాలు పొందడానికి అత్యంత అవసరం కూడా. పుట్టిన నాటి నుంచి చనిపోయేవరకూ ప్రతి చోటా ఆధార్ కార్డు కావాలి. పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకూ వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, మొబైల్ సిమ్ తీసుకోవాలన్నా, ఐటీ రిటర్న్ దాఖలు చేయాలన్నా.. అన్నింటికి ఆధార్ కార్డు ఎంతో అవసరం.

సక్రమంగా వివరాలు..

ఆధార్ కార్డు ఉండడం ఎంతో ముఖ్యమో, దానిలోని సమాచారం కచ్చితంగా ఉండేలా చూసుకోవడం కూడా చాలా అవసరం. మీ పేరు, ఇతర వివరాలలో దోషాలు ఉంటే మీ పనులకు ఆటంకం కలుగుతుంది. ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందుకే ఆధార్ కార్డులో వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవడం అందరి బాధ్యత.

నిబంధనలు ఇవే..

ఆధార్ కార్డులో వివరాలను సరిచేసుకోవడానికి, తప్పులు లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఆధార్ కేంద్రాలకు వెళ్లి లేదా ఆన్ లైన్ లో తప్పులను సరిచేసుకోవచ్చు. కానీ మీ ఆధార్ కార్డులో ఏ వివరాలను ఎన్నిసార్లు అప్ డేట్ చేసుకోవచ్చు? వాటికి ఉన్న నిబంధనలు ఏమిటి? ఆ వివరాలను తెలుసుకుందాం రండి..

పేరు.. ఆధార్ కార్డులో మీ పేరును కేవలం రెండుసార్లు మాత్రమే సవరించుకునే అవకాశం ఉంది. వివాహమైనప్పుడు లేదా దస్తావేజు ద్వారా పేరు మార్పు చేసుకోవచ్చు.

జెండర్.. మీరు మీ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే జెండర్ (లింగం)ను మార్చుకోగలరు. తర్వాత అవకాశం ఉండదు.

పుట్టిన తేదీ.. పుట్టిన తేదీని సక్రమంగా నమోదు చేస్తే, దానికి అప్ డేట్ లు చేసే అవసరం ఉండదు. అయితే నమోదు సమయంలో పొరపాటు జరిగితే ఒకసారి అప్‌డేట్ చేయవచ్చు. రుజువు కోసం సంబంధిత పత్రాలు తప్పనిసరిగా కావాలి. వాటి ఆధారంగా పుట్టిన తేదీని అప్ డేట్ చేసుకునే వీలు ఉంది.

చిరునామా.. మన చిరునామా ఎప్పుడూ స్థిరంగా ఉండకపోవచ్చు. ఉద్యోగాలు, వ్యాపారాలు, బతుకుతెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశం ఉంది. అందుకే చిరునామాను ఎన్నిసార్లు అయినా అప్ డేట్ చేసుకోవచ్చు. దీనికి పరిమితి లేదు. కానీ చిరునామాను మార్పు చేయాలంటే సంబంధిత పత్రాలు అవసరం.

అసాధారణమైన కేసులు.. పైన తెలిపినవి కాకుండా ఇతర కారణాల వద్ద ఆధార్ కార్డులో మార్పులు అవసరమైతే వాటిని అసాధారణ కేసులుగా పరిగణిస్తారు. అలాంటప్పుడు కూడా ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఆధార్ కార్డు ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాలి. సంబంధిత అధికారులు అన్ని విషయాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం అప్ డేట్ చేస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..