సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దానిని సాకారం చేసుకోడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. రోజూవారి కూలి దగ్గర నుంచి చిరు వ్యాపారులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అందరూ సొంత ఇంటి కోసం తాపత్రయ పడుతూనే ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా అది మన సంపాదనతోనే చేయడం కష్టసాధ్యమవుతోంది. అందుకే అందరూ గృహ రుణాలను ఎంచుకుంటున్నారు. ఏదో బ్యాంకులో హోమ్ లోన్ తీసుకొని సొంత ఇల్లు కొనుగోలు చేయడమో లేదా ఇల్లు నిర్మించుకోవడమే చేస్తున్నారు. తక్కువ వడ్డీతో పాటు ఈఎంఐ వెసులుబాటు, పలు చార్జీల రాయితీ వంటి వాటి కారణంగా వినియోగదారులు ఎక్కువగా వీటిని తీసుకుంటున్నారు. మీరు ఒకవేళ హోమ్ లోన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే ముందుగా మీరు కొన్ని అంశాలను పరిశోధించాలి. అవేంటంటే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీతో పాటు అధిక ప్రయోజనాలు అందిస్తున్నాయి? అనేది తెలుసుకోవాలి. తద్వారా వినియోగదారుడు తన డబ్బును ఆదా చేసుకొనే వీలుంటుంది.
అందుకే దేశంలోని పెద్ద రుణదాతలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన సంస్థల్లో వడ్డీ రేట్లను మీకు అందిస్తున్నాం. ఇవి నవంబర్ 22 నాటికి ఆయా బ్యాంకుల్లో గృహ రుణాలపై అందిస్తున్న వడ్డీ రేట్లు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. నవంబర్ 22, 2023 నాటికి, ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.6 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉన్నాయి. నిర్దిష్ట రేటు రుణ మొత్తం, కాల వ్యవధి, రుణగ్రహీత క్రెడిట్ స్కోర్, ఎంచుకున్న హోమ్ లోన్ రకం వంటి అంశాలపై ఆధారపడి ఈ వడ్డీ రేట్లలో మార్పులుంటాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజా గృహ రుణ వడ్డీ రేట్లు పరిశీలిస్తే సంవత్సరానికి 8.40 శాతం నుంచి 10.60 శాతం మధ్య ఉన్నాయి. ఇతర బ్యాంకుల మాదిరిగానే, కచ్చితమైన రేటు రుణ మొత్తం, కాల వ్యవధి, రుణగ్రహీత క్రెడిట్ స్కోర్, ఎంచుకున్న హోమ్ లోన్ రకం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఈ బ్యాంకులో గృహ రుణ వడ్డీ రేట్లు, గృహ రుణాలు, బ్యాలెన్స్ బదిలీలు, గృహ పునరుద్ధరణలు, గృహ పొడిగింపులు వంటి వివిధ వర్గాలకు వర్తిస్తాయి. ప్రస్తుతం సంవత్సరానికి 8.50 శాతం నుంచి 9.40 శాతం వరకు ఉన్నాయి.
ఐసీఐసీ బ్యాంక్.. ఈ బ్యాంకులో గృహ రుణంపై తాజా వడ్డీ రేట్లు సంవత్సరానికి 9 శాతం నుంచి 10.05 శాతం వరకు ఉన్నాయి. ఇతర బ్యాంకుల మాదిరిగానే కచ్చితమైన రేటు రుణ మొత్తం, కాలవ్యవధి, రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ వంటి అంశాల ద్వారా ప్రభావితమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..