Digilocker: డాక్యుమెంట్లు దాచుకోవడానికీ ఓ లాకర్..ఆశ్చర్యకర ఉపయోగాలివే..!
ఆస్తికి సంబంధించిన లావాదేవీల కోసం మాధవరావు తమ సొంత గ్రామానికి బయలుదేరాడు. తన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇతర అవసరమైన పత్రాలను తీసుకువెళ్లాడు. బస్సు ఎక్కి, దిగే తొందరలో వాటిని ఎక్కడో మర్చిపోయాడు. దీంతో వెళ్లిన పని పూర్తి కాలేదు సరికాదా, పోయిన పత్రాల కోసం ఆందోళన మొదలైంది. మాధవరావు మాత్రమే కాదు నేటి కాలంలో చాలామంది ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీని పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లాకర్ సర్వీస్ (డిజిలాకర్)ను ప్రవేశపెట్టింది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

నేటి కాలంలో ప్రతి పనికీ ఆధార్, పాన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, ఇతర పత్రాలు అవసరమవుతూ ఉంటాయి. ఇవి లేకపోతే పనులు ముందుకు జరగవు. అలాగని వీటిని ఎప్పుడూ మనతో ఉంచుకోలేం. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం డిజిలాకర్ వచ్చింది. డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా దీన్ని తీసుకువచ్చారు. మన విలువైన పత్రాలను దీనిలో దాచుకోవచ్చు. అవసరమైనప్పుడు చక్కగా వినియోగించుకోవచ్చు. డాక్యుమెంట్లను భౌతికంగా మనతో ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు.
డిజిలాకర్ ను ఒక రకంగా డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్ అని చెప్పవచ్చు. ప్రభుత్వం, ఇతర సంస్థలు జారీ చేసిన అన్ని రకాల పత్రాలను డిజిటల్ రూపంలో దీనిలో నిల్వ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ ఆధార్ నంబర్ తో దీనిలోకి లాగిన్ అవ్వాలి. అప్పుడు వారికి ప్రత్యేక క్లౌడ్ నిల్వ స్థలం లభిస్తుంది. దీనిలో నిల్వ చేసిన పత్రాలను అసలు భౌతిక పత్రాలతో సమానంగా పరిగణిస్తారు. డిజిలాకర్ లో భాగంగా ప్రతి పౌరుడు ఒక జీబీ వరకూ స్టోరేజీని పొందుతాడు. ప్రభుత్వ విభాగాలు డిజిటల్ గా జారీ చేసే పత్రాలను దీనిలో దాచుకోవచ్చు. లేకపోతే పత్రాలను స్కానింగ్ చేసి, లేదా పీడీఎఫ్ విధానంలో నిల్వ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా డిజిలాకర్ ను వినియోగించుకునే అవకాశం ఉంది. ఎక్కడైనా పత్రాలను సమర్పించాల్సి వచ్చినప్పుడు వాటికి సంబంధించిన యూఆర్ఎల్ లింక్ ను అందజేయవచ్చు. ఆధార్ కార్డు ఉన్నవారితో పాటు లేనివారు కూాడా ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.
డిజిలాకర్ లో మనకు వచ్చిన స్టోరేజీలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మార్కుల జాబితాలు, ఆదాయ, కుల సర్టిఫికెట్లు, బీమా పాలసీలు, ఓటరు ఐడీ, పాస్ పోర్టు, యుటిలిటీ బిల్లులను దాచుకోవచ్చు. వీటిలో కొన్ని డిజిటల్ రూపంలో జారీ చేస్తారు. అలా జారీ చేయని వాటిని స్కాన్ చేసి, లేదా పీడీఎఫ్ రూపంలో దాచుకోవచ్చు.
- ఈ సేవను పొందాలనుకునేవారు ముందుగా డిజిలాకర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. లేదా ప్రభుత్వ అధికారిక డిజిలాకర్ లింక్ అయిన డిజిలాకర్.జీవోవీ.ఇన్ ను సందర్శించాలి. అనంతరం కుడివైపు ఎగువన ఉన్న సైన్ అప్ బటన్ ను క్లిక్ చేయాలి.
- మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి, కొనసాగించు అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీని దానిలో నమోదు చేసి, కొనసాగించాలి. తర్వాత తదుపరి పేజీకి వెళతారు.
- మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ను ఎంటర్ చేసి, సైన్ అప్ పై క్లిక్ చేయాలి.
- మీ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఓపీటీని పొందవచ్చు.
- డిజిలాకర్ కు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే సపోర్టు ఎట్ డిజిటల్ లాకర్.జీవోవీ.ఇన్ కు ఇ-మెయిల్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి