Budget: కేంద్ర బడ్జెట్ ప్రకటనకు డేట్ ఫిక్స్.. ఈ సారి ఎప్పుడంటే..?
కేంద్రం ప్రభుత్వం వచ్చే ఆర్ధిక సంత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. కొత్త ఏడాది వస్తుండటం, ఏప్రిల్ నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో ఇప్పటినుంచే బడ్జెట్‌ను రూపొందిస్తుంది. అంతర్జాతీయంగా రాజకీయ, ఆర్ధిక అనిశ్చిత నెలకొనడంతో వాటికి అనుగుణంగా బడ్జెట్ ప్లాన్ చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకటనకు ముహూర్తం ఖరారు అయింది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన(ఆదివారం) పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించనుంది. ఈ సారి కూడా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ రోజున బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు కేంద్ర కేబినెట్ ఆమోదించాక నిర్మలా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటినుంచే కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు జరుగుతోంది. వేటికి ఎన్ని నిధులు కేటాయించాలనే దానిపై ఇప్పటినుంచే చర్చలు జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, డాలర్‌తో పొలిస్తే రూపాయి విలువ భారీగా పతనం కావడంతో వివిధ వస్తువుల ధరలు పెరుగుతున్న క్రమంలో కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుందనేది చర్చనీయాశంగా మారింది.
2017 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం
ఫిబ్రవరి 1వ తేదీన ఈ సారి ఆదివారం వచ్చినప్పటికీ.. అదే డేట్‌ను ఫిక్స్ చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఆ సంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగంగా.. ఆదివారం వచ్చినప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమవుతుంది. పార్లమెంట్‌లో బడ్జెట్ ఆమోదం కోసం తగినంత సమయం కల్పించడనికి రెండు నెలల ముందే ప్రవేశపెడుతున్నారు. అంతేకాకుండా కొత్త ఆర్ధిక సంవత్సరం తొలి రోజు నుంచే సజావుగా నిధుల కేటాయింపు జరగడంతో పాటు మధ్యలోనే వచ్చే అంతరాయాలను తొలగిస్తుంది.
2017 నుంచి మారిన సీన్
2017కి ముందు ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అయితే 2017లో అప్పటి ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. మార్చి చివరకు పార్లమెంట్ ఆమోదించడానికి, పాలనను క్రమబద్దీకరించడానికి, మార్కెట్ల అనిశ్చితిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది.




