ఆరోగ్యమే మహాభాగ్యమని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. అనారోగ్యం లేని వ్యక్తి అత్యంత ధనవంతుడని స్పష్టం చేశారు. దీన్ని విన్నప్పుడు మామూలు మాటగానే అనిపించినా దాని వెనుక భావం అర్థమయ్యాక వంద శాతం నిజమనిపిస్తుంది. కంటి నిండా నిద్రలేనప్పుడు, ఇష్టమైన వాటిని తినలేనప్పుడు, మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఎంత డబ్బు ఉండి ఏమి లాభమని అనిపిస్తుంది. మనచుట్టూ అనేక మంది ధనవంతులు ఉంటారు. కార్లలో తిరుగుతూ, విలాసవంతమైన భవనాల్లో జీవిస్తుంటారు. వారిలో చాాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్ర చేసిన పోస్ట్ ఇటీవల వైరల్ అయ్యింది. ఆరోగ్యం ఎంత గొప్ప సంపదో మరో సారి తెలియజేసింది. ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ జున్ జున్ వాలా ఇక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను ఆనంద్ మహీంద్ర పోస్టు చేశారు.
రాకేష్ జున్ జున్ వాలాను భారతదేశపు వారెన్ బఫెట్ అని పిలుస్తారు. ఎస్ స్టాక్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు. ఇతడికి దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్ అని కూడా పేరు ఉంది. సంపదను పెంచుకోవడం గురించి ఆయన ఎక్కువగా మాట్లాడేవారు. స్టాక్ మార్కెట్ లో పెట్టబడులకు సంబంధించి అనేక మందికి ఆయన రోల్ మోడల్. అంత పెద్ద స్టాక్ మార్కెట్ స్పెషలిస్టు అయిన రాకేష్ కూడా ఒక చెత్త పెట్టుబడి పెట్టాడు. దాని వల్ల చాాలా ఇబ్బందులు పడ్డాడు. అదే ఆయన ఆరోగ్యం. దాన్ని కాపాడుకోవడానికి సమయం వెంచించలేదు. అంటే వ్యాపార వ్యవహారాల్లో పడి తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. ఈ విషయాన్నే ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనలా ఎవ్వరూ చేయవద్దని, తమ ఆరోగ్యం కోసం సమయాన్ని పెట్టుబడి పెట్టుకోవాలని సూచించాడు.
రాకేష్ జున్ జున్ వాలా ఆగస్టు 14న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అలాగే డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఆయన ప్రతి రోజూ ఆరు పెగ్ ల విస్కీ తాగేవారు. 25 సిగరెట్లు కాల్చేవారు. వ్యాయాామం చేయకపోవడంతో అనారోగ్యం సమస్యలు తలెత్తాయి. దశాబ్దాల పాటు స్టాక్ మార్కెట్ ను ఏలారు. కేవలం రూ.5వేల పెట్టుబడితో తన ప్రయాణం ప్రారంభించి, కోట్ల సంపద ఆర్జించారు. ఆయన మరణించడానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోగ్యం గొప్పదనాన్ని తెలియజేశారు. తాను తన ఆరోగ్యాన్ని పెట్టుబడిగా పెట్టానని, అదే తన అత్యంత చెత్త పెట్టుబడి అని తెలిపారు.
ఆనంద్ మహీంద్ర తన పోస్ట్ లో రాకేష్ జున్ జున్ వాలా చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. ఎవ్వరూ తన ఆరోగ్యాన్ని విస్మరించకూడదని, దాన్ని కాపాడుకోవడానికి సమయాన్ని పెట్టుబడి పెట్టుకోవాలని సూచించారు. దీనిపై నెటిజన్ల సానుకూలంగా స్పందించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..