Tesla Cars: టెస్లా భారత్ లో తయారీ ప్లాంట్‌ను ప్రారంభించబోదని ఆటో దిగ్గజం సీఈఓ ఎలాన్ మస్క్ తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి ట్విట్టర్ వేధికగా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. దేశంలో దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించడానికి, సర్వీసింగ్ కు టెస్లాను మొదటగా అనుమతించే వరకు.. ప్లాంట్ స్థాపన కార్యరూపం దాల్చదని బిలియనీర్ స్పష్టం చేశారు. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ మేజర్ దక్షిణ ప్రాంతంలో ఒక ప్లాంట్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు నివేదికలు వస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్ లో టెస్లా తయారీ ప్లాంట్‌కు సంబంధించిన అప్‌డేట్ గురించి మస్క్‌ను ఒక ట్విట్టర్ వినియోగదారుడు ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌కు ప్రతిస్పందిస్తూ.. మస్క్ ఇలా బదులిచ్చారు “టెస్లా కార్లను విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి మాకు ముందుగా అనుమతి లేని ఏ ప్రదేశంలోనైనా తయారీ ప్లాంట్‌ను స్థాపించబోము.”
Tesla will not put a manufacturing plant in any location where we are not allowed first to sell & service cars
— Elon Musk (@elonmusk) May 27, 2022
దీనికి తోడు మన దేశంలో స్టార్‌లింక్ ఆమోదంపై ఏదైనా అప్‌డేట్ ఉందా అని మరొక ట్విట్టర్ వినియోగదారు మస్క్‌ని అడిగారు. దానికి బిలియనీర్ స్పందిస్తూ, ప్రభుత్వం నుంచి అనుమతి కోసం కంపెనీ వేచి ఉందని వెల్లడించారు. టెస్లా, భారత ప్రభుత్వం దేశంలోకి ప్రవేశించడానికి ఎలక్ట్రిక్ కార్ల తయారీకి మార్గం ఉందా లేదా అని చూడటానికి దాదాపు రెండు సంవత్సరాలుగా చర్చలు జరుపుతున్నారు. గత నెలలో.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ టెస్లా తమ ఆటోమొబైల్స్‌ను భారత్ లో తయారు చేస్తే, కంపెనీ కూడా లాభపడుతుందని అన్నారు. అయితే చైనాలో తయారు చేసిన కార్లను దేశంలోకి దిగుమతి చేసి విక్రయించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ కుదరదని భారత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. భారత మార్కెట్ పెద్దది.. ఇక్కడి నుంచి ప్రపంచంలోని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు ఉంటుందని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ టెస్లా చేసిన అభ్యర్థనను కేంద్రం ఇప్పటికే తోసిపుచ్చింది.
ప్రస్తుతం చైనాలో కంపెనీ నిర్మించిన గిగా ఫ్యాక్టరీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కరోనాపై చైనా తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇందుకోసం వెచ్చించిన డబ్బు వృధాగా మారుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా మరో ప్లాంట్ ఏర్పాటు చేయాలని టెస్లా యోచిస్తున్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఈవీ పరిశ్రమలకు హబ్ గా ఉంది. ఈ తరుణంలో టెస్లా ప్లాంట్ నెలకొల్పేందుకు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు ఇప్పటికే స్వాగతించాయి. కానీ.. భవిష్యత్తులో టెస్లా భారత్ లోకి ప్రవేశించేందుకు అవకాశం లేకపోలేదని చెప్పలేం.