Electric Cars: ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) పర్యావరణానికి హాని చేయవు. సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాల కంటే చాలా మెరుగైనవి. ఇది కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇప్పుడు వినియోగదారుల దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లింది. EVలు ఆర్థికంగా మాత్రమే కాకుండా భారతదేశంలో పన్ను ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి. భారతీయ పన్ను చట్టాల ప్రకారం.. వ్యక్తిగత ఉపయోగం కోసం ఉపయోగించే కార్లు విలాసవంతమైన ఉత్పత్తి కేటగిరిలో పరిగణిస్తారు.
కాబట్టి జీతం పొందే వ్యక్తులు కార్ల రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాలను పొందలేరు. కానీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తోంది. వాస్తవానికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లకు కొరత లేదు. పెరుగుతున్న అమ్మకాలతో వివిధ తయారీదారులు రాబోయే సంవత్సరంలో కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి సిద్దంగా ఉన్నారు.
రుణంపై పన్ను మినహాయింపు
EV లోన్‌ను చెల్లించేటప్పుడు సెక్షన్ 80EEB కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది ఫోర్ వీలర్, టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు కూడా వర్తిస్తుంది. రుణంపై EVని కొనుగోలు చేయాలనుకున్నవారు సెక్షన్ 80EEB కింద రుణం మొత్తంపై చెల్లించే వడ్డీపై రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపుకు అర్హులు. జీతం పొందే నిపుణులకు కూడా ఇది వర్తిస్తుంది. అంతేకాదు ఆకర్షణీయమైన వాహనం కూడా మీ సొంతమవుతుంది.
అయితే సాధారణ వ్యక్తులు మాత్రమే ఈ మినహాయింపును పొందగలరు. పన్ను చెల్లింపుదారులు ఈ మినహాయింపుకు అర్హులు కాదు. మీరు HUF, AOP, భాగస్వామ్య సంస్థ, కంపెనీ లేదా మరేదైనా పన్ను చెల్లింపుదారు అయితే మీరు ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయలేరు. ఈ తగ్గింపు ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మునుపెన్నడూ ఎలక్ట్రిక్ వాహనాన్ని కలిగి ఉండని వ్యక్తి మాత్రమే సెక్షన్ 80EEB లోన్ పన్ను మినహాయింపుకు అర్హులవుతారు.