
పెట్టుబడిదారుల నుంచి డబ్బులను సేకరించి, వాటితో వివిధ స్టాక్ లు, బాండ్లు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసే వాటినే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. వీటిని స్టాక్ మార్కెట్ లో అనుభవం కలిగిన మేనేజర్లు నిర్వహిస్తారు. పెట్టుబడిదారుడికి అధిక రాబడి అందించడమే వీరి ప్రధాన లక్ష్యం. పెట్టుబడిదారులు ఆయా మ్యూచువల్ ఫండ్స్ లో వాటాలు, యూనిట్లు కలిగి ఉంటారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)లో మ్యూచువల్ ఫండ్స్ రిజస్టర్ అయి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దానిలో భాగంగా అవి ఎన్ని రకాలు, వాాటి వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ అనే మూడు రకాలు ఉంటాయి.
బహిరంగంగా వ్యాపారం నిర్వహిస్తున్న వివిధ సంస్థల్లో స్టాక్ లు, ఈక్విటీని కలిగి ఉన్న పెట్టుబడి సంస్థలను ఈక్విటీ ఫండ్స్ అంటారు. ధీర్ఘకాలంలో మూలధనం పెంచడం, రాబడిని సంపాదించడం వీటి ప్రధాన లక్ష్యం. దీని కోసం పెట్టుబడి దారుల నుంచి నిధులు సేకరించి, స్టాక్ లను కొనుగోలు చేస్తాయి.
బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, స్థిర ఆదాయ ఆస్తులు తదితర డెట్ సాధనాలలో పెట్టుబడిని పెడతాయి. పెట్టుబడిదారుల నుంచి డబ్బులను సమీకరించి, వాటిని కొనుగోలు చేస్తాయి.
స్టాక్ లు, బాండ్లు తదితర ఒకటి కంటే ఎక్కువ విభిన్న ఆస్తి తరగతులను కలిగిన ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ను హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. అధిక రాబడి, స్థిరమైన ఆదాయం పొందేందుకు ఉపయోగపడతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి