స్టార్టప్‌లు ముంచుతున్నాయి. ఇన్వెస్టర్లకు నష్టాలే మిగులుస్తున్నాయి. ఒకటో అరో అంటే తట్టుకోవచ్చు.. కానీ సగానికి పైగా సంపదను కరిగించేస్తున్నాయి. ఏడాదిగా మార్కెట్లోకి వచ్చిన కొత్త ఐపీఓల ఓవర్ హైప్ లిస్టింగ్ పెట్టుబడిదారులను నిలువునా ముంచేశాయి. ఓ కంపెనీ పెట్టాలి. వినియోగదారులను ఆకట్టుకునేలా ఆఫర్లు ఉంచాలి. ప్రజల్లోకి ఆ కంపెనీ పేరు తీసుకెళ్లి.. ఇక్కడ చాలా తక్కువ ధరల్లోనే దొరుకుతాయన్న నమ్మకాన్ని కలుగజేయాలి. అప్పటికే కంపెనీ చాలా కష్టాల్లో ఉంటుంది. కానీ కంపెనీ బ్రాండ్ వాల్యూ మాత్రం భారీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో తమ కంపెనీని మార్కెట్లో లిస్టింగ్ చేయాలి.
వేల నుంచి లక్షల కోట్ల బ్రాండింగ్ చూపించి ఇన్వెస్టర్లను ఊరించి.. కంపెనీ వాల్యూని అమాంతం పెంచేసి మార్కెట్లోకి దించాలి. ఇదే సమయంలో చిన్నతరహా ఇన్వెస్టర్లు దీనికి ఆకర్షితులై.. తమ సంపాదన.. సేవింగ్స్.. అవసరమైతే అప్పు తీసుకుని అయినా.. అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తీరా.. ఏడాదో.. రెండేళ్లో దాటిన తర్వాత అసలు కథ బయటకి వస్తుంది. ఇదిగో ఈ కంపెనీల మాదిరిగానే. ఈ ఆరు కంపెనీలు ఒక్క ఏడాదిలోనే రెండు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్మును ఆవిరి చేశాయి. నైకా, డెల్హివరి, పేటీయం, పాలసీ బజార్, జొమాటో, కార్‌ట్రేడ్ టెక్ కంపెనీల ఇన్వెస్టర్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. 30 నుంచి 70శాతం వరకు నష్టాల బాటపట్టాయి.
ఈ ఆరుసంస్థలు చిన్న కంపెనీలేం కాదు.. ముఖ్యంగా పేటీయం గురించి వినని వారుండరు. ఆ యాప్‌ని వాడేవారు కోట్లలోనే ఉన్నారు. అయినాగాని సంస్థకి అత్యంత దారుణంగా నష్టాలొచ్చాయి. పేటీఎం మాతృ సంస్థ ఒన్-97 కమ్యూనికేషన్స్ పబ్లిక్ ఇష్యూ 2021 నవంబరు 8-10 తేదీల్లో జరిగింది. అదేనెల 18న స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. 2వేల 150 రూపాయల బంపర్ ధరకు మార్కెట్లో లాంచ్ చేశారు. సరిగ్గా ఏడాది తిరిగే సరికి పేటీఎం వాల్యూ ఎంతో తెలుసా.. కేవలం 450రూపాయలు. షేరు ధర 75 శాతం పడిపోయి అక్షరాలా 66వేల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. అంటే రూపాయి పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్‌కి మిగిలింది పావలానే. పేటీఎంలో ఇన్వెస్ట్ చేసిన జపాన్‌కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ ఈనెల మొదట్లో తన షేర్లలో కొంతభాగాన్ని ఆమ్మేసింది. దీంతో పేటీఎం వాల్యూ.. పడుతూ వచ్చింది. ఈ నెలలోనే 30శాతం డౌన్ అయింది షేర్ వాల్యూ. అటు రూపాయి వాల్యూ పడుతుండడంతో కూడా స్టార్టప్‌ల పాలిట శాపంగా మారింది.
బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కేటగిరాలో పేటీఎం భారత దేశ చరిత్రలోనే అత్యంత దారుణంగా పతనమైన స్టాక్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. స్పెయిన్‌కి చెందిన బ్యాంకియా ఏడాదిలోనే 82శాతం పతనమైతే.. పేటీఎం 75శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇదే బాటలో నైకా కూడా నిలిచింది. ఈకామర్స్ సంస్థగా ఉన్న నైకా.. కేవలం మహిళల సౌందర్య ఉత్పత్తులమీద ఆధారపడి మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఏడాదిలోనే 50శాతం పడిపోయి.. 50వేల కోట్ల రూపాయలు నష్టపోయింది.
ఇక కొరియర్ డెలివరీ సంస్థ డెల్హివరి పరిస్థితి కూడా అంతే అయింది. ఆరు నెలల్లోనే 30శాతం పడి 12వేల కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. పాలసీ బజార్ 70శాతం పడింది. ఇక జొమాటో పరిస్థితి చెప్పనక్కర్లేదు. 40-50శాతం పడడంతో.. ఇన్వెస్టర్లు 40వేల కోట్లు నష్టపోయి లబోదిబోమంటున్నారు. అటు కార్‌ట్రేడ్ టెక్ కూడా 66శాతం పడి 4500 కోట్ల ఆవిరయ్యాయి. ఆరు కంపెనీలు అక్షరాలా 2లక్షల 12వేల 568 కోట్ల నష్టాన్ని ఇన్వెస్టర్లకు మిగిల్చాయి. అటు షేర్ మార్కెట్ ఆల్‌టైమ్ హైని తాకుతున్నా.. ఈ కంపెనీలు మాత్రం నష్టాల్లోకే వెళ్తున్నాయి.
ప్రైవేటు కంపెనీలుగా ఉన్న సమయంలో బ్రాండ్ వాల్యూ అమాంతం పెంచుకున్న సంస్థలు.. పబ్లిక్ ఇష్యూ తర్వాత నష్టాలు చూపెడుతూ.. వెళ్లాయి. అటు కంపెనీ పెర్ఫామెన్స్‌ని కూడా పెంచుకోలేకపోయాయి. అప్పుడు వినియోగదారులకు ఇచ్చిన ఆఫర్లను ఇప్పుడు ఇవ్వలేకపోవడం.. తమ ప్రాడక్ట్‌ల రేట్లు పెంచేయడం.. సర్వీసులు తగ్గించడం వల్ల కస్టమర్లు తగ్గి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. స్టార్టప్స్ మంచివే కాని.. వ్యాపారంలో లోపాల వల్ల చిన్నస్థాయి ఇన్వెస్టర్లు దివాళా తీసే పరిస్థితి వచ్చింది. పది ఇరవై శాతం నష్టాలను భరించగలం కాని.. తమ పెట్టుబడిలో 50-70శాతం కోల్పోవడాన్ని ఎవరూ కోరుకోరు. ఇక ఈ కంపెనీలు తమ పెర్ఫామెన్స్‌ను పెంచుకుంటాయో లేదో కూడా తెలియని స్థితి ఉంది. దీంతో స్టార్టప్‌లు, ఐపీఓలు అంటేనే ఇన్వెస్టర్లు జంకే పరిస్థితులున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..