AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Rooftop Scheme: సూర్యఘర్ పథకానికి బ్యాంకుల షాక్.. బిల్లు తగ్గాలంటే సిబిల్ ఉండాలట..!

Solar Rooftop Scheme: సోలార్ యూనిట్ల లబ్ధిదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చని, అయితే అర్హత ఉన్నప్పటికీ బ్యాంకు సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత ఫిర్యాదు చేయాలని రెడ్కో అధికారులు సూచిస్తున్నారు. పర్యావరణానికి మేలు చేస్తూ, సామాన్యుడికి కరెంట్ బిల్లుల భారం..

Solar Rooftop Scheme: సూర్యఘర్ పథకానికి బ్యాంకుల షాక్.. బిల్లు తగ్గాలంటే సిబిల్ ఉండాలట..!
Solar Rooftop Scheme
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 07, 2026 | 6:09 PM

Share

Solar Rooftop Scheme: ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోతతో ఇళ్లలో ఏసీలు, కూలర్లు ఫుల్ గా తిరుగు తున్నాయి. ఫలితంగా.. కరెంట్ మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. దీంతో విద్యుత్ బిల్లులు సామాన్యుడి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు కొండలా వచ్చిపడుతున్న బిల్లులను తప్పించుకోవడానికి జనం సోలార్ వైపు పరుగులు తీస్తున్నారు. కేంద్రం సబ్సిడీ ఇస్తామంటోంది. దీనికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ బ్యాంకర్ల కోర్రీలతో సూర్యఘర్ పథకం లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు.

మండుతున్న ఎండలతో విద్యుత్ వినియోగం పెరిగి బిల్లులు భారంగా మారుతున్నాయి. మరోవైపు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వినియోగ దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు సామాన్యులు సోలార్ విద్యుత్ పై ఆసక్తి చూపుతున్నారు. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ కష్టాలకు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: భర్తను హతమార్చేందుకు భార్యకు ChatGPT సాయం చేసిందా..? OpenAIపై భర్త సంచలన కేసు.. అసలేం జరిగిందంటే!

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన పథకం సామాన్యులకు వరంగా మారుతుందని భావించారు. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ప్రభుత్వ రాయితీ కూడా పొందవచ్చన్న ఆశతో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ పథకం కింద ఒక కిలోవాట్ నుంచి మూడు కిలోవాట్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం వరకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కేంద్రం నిర్ణయించిన నిబంధనల ప్రకారం సామర్థ్యాన్ని బట్టి రాయితీ లభిస్తుంది. ముఖ్యంగా మూడు కిలోవాట్ల వరకు గరిష్ఠంగా రూ.78 వేల వరకు కేంద్ర సబ్సిడీ అందుతుంది. నిబంధనలకు అనుగుణంగా నెట్ మీటరింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గృహ వినియోగదారులకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచితంగా లభిస్తుంది. మిగిలిన అదనపు విద్యుత్తును నెట్ మీటరింగ్ ద్వారా గ్రిడ్‌కు సరఫరా చేసి డిస్కమ్ ద్వారా ఆదాయం కూడా పొందవచ్చు. అయితే అందుకు సంబంధించిన బిల్లింగ్, క్రెడిట్ విధానం స్థానిక విద్యుత్ పంపిణీ సంస్థ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

దేశంలోనే తెలంగాణ టాప్..

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 1,07,903 దరఖాస్తులు రాగా, అందులో 73,135 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను విజయవంతంగా ఏర్పాటు చేసి దేశంలోనే తెలంగాణ ఉత్తమ ప్రగతిని కనబరుస్తోంది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోలార్ యూనిట్ల ఏర్పాటుకు 8500 వరకు దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఇందులో 5900 వరకు సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేశారు.

అసలు ట్విస్ట్ ఇక్కడే..

సూర్యుడి వెలుగును విద్యుత్‌గా మార్చుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. సామాన్యుల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ కనిపించాలన్నది సూర్యఘర్ పథకం ఉద్దేశం. కానీ ఆ లక్ష్యానికి బ్యాంకుల రుణ నిబంధనలు అడ్డుగోడలుగా మారుతున్నాయి. సబ్సిడీ వస్తుందన్న ధీమాతో బ్యాంకుల మెట్లు ఎక్కుతున్న వినియోగదారులకు అక్కడే అసలు పరీక్ష ఎదురవుతోంది. సోలార్ యూనిట్ ఏర్పాటుకు లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత క్షేత్ర పరిశీలకుడు అర్జీదారు ఇంటికి వెళ్లి సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాలి. సోలార్ ప్యానల్ ఏర్పాటులో ప్రభుత్వ సబ్సిడీ పొందేందుకు లబ్ధిదారుడు తన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం బ్యాంకుల నుండి రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది.

బ్యాంకుల కొర్రీలు.. కస్టమర్ల కన్నీళ్లు..

సోలార్ యూనిట్ల ఏర్పాటుకు రుణం కోసం వెళ్తున్న సామాన్యులకు బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. సోలార్ యూనిట్ ఏర్పాటుకు లబ్ధిదారుడి వాటా కోసం రుణం అడిగితే.. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందంటూ లోన్ ఇవ్వడానికి నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నాయి. మరికొందరికి సిబిల్ స్కోర్ బాగున్నా.. క్షేత్రస్థాయి పరిశీలన, ఇతర ప్రక్రియల పేరుతో నెలల తరబడి తిప్పుతున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నా.. సిబిల్ స్కోర్ పేరుతో బ్యాంకులు దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సోలార్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆసక్తి ఉన్నా.. ఆర్థిక స్తోమత లేని వారు మధ్యలోనే ఆగిపోతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరగలేక, అధికారుల తాత్సారాన్ని భరించలేక పలువురు వినియోగ దారులు ఈ పథకమే మాకొద్దంటూ వెనక్కి తగ్గుతున్నారు.

మరోవైపు.. అధికారుల వివరణ..

సోలార్ యూనిట్ల లబ్ధిదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చని, అయితే అర్హత ఉన్నప్పటికీ బ్యాంకు సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత ఫిర్యాదు చేయాలని రెడ్కో అధికారులు సూచిస్తున్నారు. పర్యావరణానికి మేలు చేస్తూ, సామాన్యుడికి కరెంట్ బిల్లుల భారం తగ్గించాలనే పీఎం సూర్య ఘర్ పథకం ఆశయం బాగున్నా.. క్షేత్రస్థాయిలో బ్యాంకుల కొర్రీల వల్ల ఈ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రభుత్వం స్పందించి సోలార్ రుణాల ప్రక్రియను సులభతరం చేయకపోతే.. ఎల్నినో ఎండలకు తోడు బ్యాంకుల తిరస్కరణలతో సామాన్య వినియోగదారుడు మరింత మాడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Tankless Geyser: ట్యాంక్‌లెస్ గీజర్ అంటే ఏమిటి? నీటిని స్టోర్ చేయకుండానే వేడి చేస్తుంది.. కరెంట్ ఆదా కూడా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us