AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Profits: దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారాన్ని మించిపోయిందిగా..!

భారతదేశంలో ఆభరణం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారమే. అయితే ఇటీవల బంగారం ధరలు అధికంగా ఉండడంతో వెండి అమ్మకాలు కూడా పెరిగాయి. పెట్టుబడి విషయంలో బంగారం కంటే వెండిలోనే పెట్టుబడికి అందరూ ఆసక్తి చూపించారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా వెండి అమ్మకాలు ఇటీవల పెరిగాయి. అయితే అదే స్థాయిలో ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా వెండి కొనుగోళ్లు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో వెండిలో పెట్టుబడిపై పెట్టుబడిదారుల ఆసక్తి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Silver Profits: దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారాన్ని మించిపోయిందిగా..!
Silver Profits
Nikhil
|

Updated on: Nov 24, 2024 | 4:15 PM

Share

ఇటీవలి కాలంలో వెండి అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ధన్‌తేరస్‌కు ముందు పెట్టుబడిదారులు వెండి కొనుగోలుపై ఆసక్తి చూపారు. పెట్టుబడిదారులు భౌతిక రూపంలోనే కాకుండా ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) రూపంలో కూడా కొనుగోలు చేశారు. గత ఆరు నెలల్లో వెండి 20.25 శాతం రాబడిని అందించగా బంగారం రాబడి 10.29 శాతంగా ఉంది. రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ తన నివేదికలో వెండి ఈటీఎఫ్‌ల కింద మొత్తం ఫోలియోల సంఖ్య దాదాపు 215 శాతం పెరిగి 4.47 లక్షలకు చేరుకుందని అక్టోబర్ 2024లో ఇది 1.42 లక్షలకు చేరుకుందని పేర్కొంది. 2024 అక్టోబర్‌లో నికర ఇన్‌ఫ్లోలు 24 శాతం పెరిగి రూ.643.10 కోట్లకు చేరాయి. ఇవి గత ఏడాది రూ.518.02 కోట్లుగా ఉన్నాయి. నిర్వహణలో ఉన్న ఆస్తులు నాలుగు రెట్లు పెరిగి 2023 అక్టోబర్‌లో రూ. 2,844.76 కోట్ల నుంచి 2024 అక్టోబర్‌లో రూ. 12,331 కోట్లకు చేరుకోవడంతో సిల్వర్ ఇటిఎఫ్‌లు అపూర్వమైన పెరుగుదలను నమోదు చేశాయని పేర్కొంది.

గోల్డ్ ఈటీఎఫ్‌లు చాలా కాలంగా మార్కెట్లో ఉండగా వెండి ఈటీఎఫ్‌లు 2022లో ప్రారంభించారు. వెండిలో ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఒక సంవత్సరాల కాలానికి సగటు రాబడి వరుసగా 7.57 శాతం, 16.02 శాతం, 20.25 శాతం, 32.49 శాతం పరిధిలో ఉంది. ఇది గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా వరుసగా ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఒక సంవత్సరాల వ్యవధిలో ఉత్పత్తి చేసిన సగటు రాబడికి 5.32 శాతం, 14.29 శాతం, 10.29 శాతం, 28.07 శాతంగా ఉంది. 

ఏప్రిల్ 2023లో 8 వద్ద ఉన్న వెండి ఈటీఎఫ్‌ల సంఖ్య ఆగస్టు 2024 నాటికి 12కి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశీయ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ అస్థిరత వంటి కారణాల వల్ల వెండికి డిమాండ్ పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్, ఇన్వెస్ట్‌మెంట్, మేనేజ్‌మెంట్‌లో దాని పాత్ర మరింత కీలకం కావడంతో మార్కెట్ రాబోయే నెలల్లో మరిన్ని సిల్వర్ ఈటీఎఫ్‌లను ప్రారంభించవచ్చని పేర్కొంటున్నారు. సిల్వర్ ఈటీఎఫ్‌లు తక్కువ వ్యవధిలో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించగలిగాయని వివరిస్తున్నారు. రానున్న నెలల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి