Digital Arrest Scam: వాట్సాప్ వీడియో కాల్‌తో రూ.1.94 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. వెలుగులోకి మరో డిజిటల్ అరెస్ట్ స్కామ్
భారతదేశంలో ఇటీవల డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు ఎక్కువయ్యాయి. కేటుగాళ్లు ప్రజలను మోసం చేసి డబ్బు గుంజడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వయసైన వారితో పాటు ఉద్యోగులను టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేశామని బ్యాంకుల ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఓ వృద్ధుడి నుంచి రూ.1.94 కోట్లు కొట్టేశారు.
భారతదేశంలో డిజిటల్ అరెస్ట్ కేసులు ముఖ్యమైన సైబర్ ముప్పుగా మారాయి. ప్రతిరోజూ మోసగాళ్లు అదే పనిగా నెంబర్లకు కాల్ చేసి డబ్బును గుంజుతున్నారు. తాజాగా ముంబైకు చెందిన 68 ఏళ్ల బాధితుడు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌కు గురయ్యాడు. అరెస్ట్ అయ్యాననే భయంతో తన ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి రూ.1.94 కోట్లను మోసగాళ్లకు దఫదఫాలుగా చెల్లించారు. ఇటీవల వచ్చిన ఓ నివేదిక ప్రకారంనవంబర్ 30న బాధితుడికి ఒక అన్‌నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి పోలీస్ డ్రెస్‌తో ఉండడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ కూడా పోలీస్ స్టేషన్ మాదిరిగా ఉండడంతో బాధితుడు షాక్ అయ్యాడు. బాధితుడికి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారిగా పరిచయం చేసుకుని భారతీయ వ్యాపారవేత్త నరేష్ గోయల్‌కు సంబంధించిన హై ప్రొఫైల్ మనీలాండరింగ్ కేసులో మీ ప్రమేయం ఉందని వృద్ధుడితో అన్నాడు.
ముఖ్యంగా నరేష్ గోయల్ నుంచి కమీషన్ మీ అకౌంట్‌కు పంపారని, కాబట్టి ఏటీఎం వివరాలను కార్డు వివరాలను అందించాలని కోరి వాటిని సంపాదించారు. తదుపరి విచారణ కోసం బాధితుడిని క్రైమ్ బ్రాంచ్‌కు రావాలని భయపెట్టారు. ముఖ్యంగా తాము ఆన్‌లైన్ ద్వారా దర్యాప్తు చేస్తున్నామని, కాబట్టి రూమ్ నుంచి బయటకు వెళ్లవద్దని పేర్కొన్నారు. విచారణ ముసుగులో మోసగాళ్లు బాధితురాలి బ్యాంకు వివరాలను కనుగొన్నారు. ఏడు రోజులుగా పలు దఫాలుగా రూ.1.94 కోట్లు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా ఈ విషయం గురించి ఎవరితో చర్చింవద్దని భయపెట్టారు. కుటుంబ సభ్యులను చెప్పవద్దని తెలిపారు. అయితే తాను మోసపోయానని అనుమానంతో బాధితుడు తన కుమార్తెతో చెప్పడంతో మోసం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బెంగళూరులోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
డిజిటల్ అరెస్ట్ లాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే విజిలెన్స్ కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. మీకు అలాంటి కాల్స్ వస్తే, ట్రాప్‌లో పడవద్దని చెబుతున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు ఎప్పుడూ ఆన్‌లైన్‌లో కేసుల దర్యాప్తు చేయరనే విషయాన్ని గుర్తించాలని వివరిస్తున్నారు. అలాగే ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా డబ్బు అడగరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా, “డిజిటల్ అరెస్ట్” అనే పదం స్కామర్లు సృష్టించారు. ఈ తరహా అరెస్ట్ అసలు భారతీయ చట్టంలో లేదు. ఎవరైనా మిమ్మల్ని దానితో బెదిరిస్తే, అది నిస్సందేహంగా మోసం అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి కాలర్ల భయంతో ఫోన్ కాల్‌లు లేదా సందేశాల ద్వారా బ్యాంక్ వివరాలు, ఓటీపీలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా ఫోన్‌లు వస్తే కచ్చితంగా స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు బ్యాంకు అధికారులకు తెలియజేయాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి