SBI Warning : కరోనా కాలంలో ఆన్‌లైన్ లావాదేవీలు పెరగడంతో మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో సైబర్ నేరస్థులు KYC నవీకరణను నటిస్తూ ప్రజలను తమ ఉచ్చులో బంధిస్తున్నారు. ఈ దృష్ట్యా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కేవైసీ మోసాల గురించి తన వినియోగదారులను హెచ్చరించింది. కేవైసీ మోసాలు నిజమేనని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపించిందని ఎస్‌బిఐ తన ట్వీట్‌లో వినియోగదారులను హెచ్చరించింది. ఎటువంటి కేవైసీ లింక్‌లను ఓపెన్ చేయవద్దని కోరుతుంది.
కొంతమంది సైబర్ కేటుగాళ్లు మీ వ్యక్తిగత వివరాలను పొందడానికి బ్యాంక్ ప్రతినిధులుగా నటిస్తూ సెల్‌ఫోన్‌కి మెస్సేజెస్ పంపుతున్నారు. ఇటువంటి వాటిపై అనుమానం ఉంటే http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ నేరస్థుల బారిన పడకుండా వినియోగదారులకు ఎస్బీఐ కొన్ని చిట్కాలను పేర్కొంది. ఏదైనా తెలియని లింక్‌పై క్లిక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించమని సూచించింది. KYC నవీకరణ కోసం బ్యాంక్ ఏ కస్టమర్‌కి ఎటువంటి సందేశాలను పంపదని గుర్తు ఉంచుకోండి. మీ మొబైల్ నంబర్, రహస్య డేటాను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది.
ప్రభుత్వం హెచ్చరించింది
కేవైసీ మోసం గురించి హోం మంత్రిత్వ శాఖ కూడా వినియోగదారులను హెచ్చరించింది. కెవైసి / రిమోట్ యాక్సెస్ యాప్ మోసం గురించి జాగ్రత్త వహించాలని సూచించింది. ఈ రోజుల్లో మోసగాళ్ళు ప్రజలను KYC కోసమని కాల్ లేదా SMS చేస్తూ అడుగుతున్నారు. ఈ విధంగా వ్యక్తిగత డేటాను ప్రజల నుంచి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. తదనంతరం అందినకాడికి దోచుకుంటున్నారు. KYC అంటే తమ కస్టమర్లు నిజమైనవారేనా అని నిర్ధారించడానికి బ్యాంకులు చేసే ముఖ్యమైన విధి. 2021 డిసెంబర్ 31 లోపు కేవైసీ అప్‌డేట్ చేయని వినియోగదారులపై ఎలాంటి జరిమానా విధించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులు, ఇతర నియంత్రిత ఆర్థిక సంస్థలను కోరింది.