SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్.. అబ్బురపరిచే ఫీచర్లతో యోనో 2.0 యాప్.. ప్రత్యేకతలు ఇవే..
దేశంలోనే ఎక్కువ కస్టమర్లు కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ సేవలను మరింతగా విస్తరిస్తోంది. ఇందుకోసం మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో ఉండగా.. ఇప్పుడు దానికి సరికొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది. మంగళవారం యోనో 2.0 వెర్షన్ యాప్‌ను రిలీజ్ చేసింది. దీని ప్రత్యేకతలు ఇవే..

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అగ్రగామిగా ఉన్న ఎస్బీఐ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారులు సులువుగా బ్యాంక్ సేవలు ఉపయోగించుకునేలా సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. బ్యాంక్ బ్రాంచ్‌ను విజట్ చేయకుండానే ఇంట్లోనే ఉండి మొబైల్ ద్వారా అన్నీ సేవలు పొందేలా డిజిటల్ సేవలను విస్తరిస్తోంది. డిజిటల్ సేవలు పొందేందుకు ఎస్బీఐ కస్టమర్లకు యోనో యాప్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ యాప్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ సరికొత్త ఫీచర్లతో యోనో 2.0 వెర్షన్‌ను ఎస్‌బీఐ మంగళవారం లాంచ్ చేసింది. ఈ యాప్‌లో కొత్తగా ఎలాంటి సేవలు అందుబాటులోకి వచ్చాయనేది తెలుసుకుందాం.
మరింత వేగంగా పేమెంట్స్
కొత్త వెర్షన్‌లో మరింత వేగంగా డిజిటల్ ప్రాసెస్ జరిగేలా రూపొందించారు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా లేదా బిల్లుల చెల్లింపు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) సేవలు మరింత వేగంగా, సరళంగా ఈ కొత్త వెర్షన్‌లో ఉపయోగించుకోవచ్చు. యూపీఐ యాప్స్ ఫోన్ పే, గూగుల్ పేకు పోటీగా వేగంగా బ్యాంకింగ్ సేవలు అందించేలా ఎస్బీఐ అప్‌గ్రేడ్ వెర్షన్ లాంచ్ చేసింది. అలాగే ఇందులో భద్రతా ఫీచర్లను కూడా మరింతగా జోడించారు. ఏవైనా లావాదేవీలు చేసేటప్పుడు వన్ టైమ్ పాస్‌వర్డ్ ప్రక్రియ జోడించింది. దీని వల్ల కస్టమర్లకు అదనపు భద్రత ఉండనుంది. ఇక వేగంగా లావాదేవీలు జరిగేలా యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా లావాదేవీలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది.
టార్గెట్ 20 కోట్లు
ప్రస్తుతం యోనో యాప్‌ను 9 నుంచి 10 కోట్ల మంది కస్టమర్లు వాడుతున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ సంఖ్యను 20 కోట్లకు తీసుకెళ్లేలా లక్ష్యం పెట్టుకుంది. మరింత మంది కస్టమర్లను డిజిటల్ సేవలు పొందేలా చేయాలని అనుకుంటోంది. డిజిటల్ సేవల్లో సహాయం చేసేందుకు డిజిటల్ సపోర్ట్ సిబ్బందిని కూడా ఎస్‌బీఐ పెంచనుంది. రాబోయే ఎనిమిది నెలల్లో దాదాపు 6,500 మంది డిజిటల్ సపోర్ట్ సిబ్బందిని బ్రాంచుల్లో నియమించుకోవాలని అనుకుంటోంది. అలాగే యోనో యాప్‌లో డిజిటల్ సేవలకు సర్వీస్ ఛార్జీలను తగ్గించనుంది. దీంతో రానున్న రోజుల్లో ఎస్బీఐ కస్టమర్లు డిజిటల్ బ్యాంకింగ్‌లో సరికొత్త అనుభూతిని పొందనున్నారు.
