Gold Loan: గోల్డ్ లోన్ ఎంతవరకు తీసుకోవచ్చు..? మీకు ఎంత వస్తుందనేది ఎలా లెక్కిస్తారు..? ఆర్బీఐ కొత్త రూల్స్..
అత్యవసర ఆర్ధిక పరిస్థితుల క్రమంలో చాలామంది గోల్డ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. తమ ఇంట్లో భద్రపర్చుకున్న బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చాలామంది ఈ రూపంలో లోన్ పొందుతారు.

చాలామంది డబ్బులు అవసరమైన సమయంలో బ్యాంకుల నుంచి గోల్డ్ లోన్ తీసుకుంటారు. ఆ తర్వాత వడ్డీతో సహా లోన్ చెల్లించి తమ బంగారాన్ని విడిపించుకుంటారు. అయితే బంగారంపై లోన్ పొందేందుకు అనేక మార్గదర్శకాలు, ఎల్‌టీవీ పరిమితులు, నియమాలు, నిబంధనలు ఆర్బీఐ విధించింది. మీరు గోల్డ్ లోన్‌పై ఎంతవరకు లోన్ పొందొచ్చు..? మీకు ఎంతవరకు లోన్ వస్తుందనేది ఎలా లెక్కిస్తారు..? తిరిగి చెల్లించడంతో జాప్యం జరిగితే పరిహారం ఎంత ఉంటుంది..? గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి..? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎంతవరకు లోన్ పొందవచ్చు?
గోల్డ్ లోన్ పొందటంలో లోన్ టు వాల్యూ(LTV) అనేది కొలమానంగా భావిస్తారు. ఒక వ్యక్తి 1 కిలోగ్రామ్ వరకు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టవచ్చు. ప్రస్తుతం ఉన్న ధరలు, బంగారం స్వచ్చతను బట్టి ఎంత లోన్ వస్తుందనేది నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఫిబ్రవరి 23 నాటికి ఒక గ్రాము గోల్డ్ ధర రూ.14,750గా ఉంది. మీరు 75 శాతం ఎల్‌టీవీ వద్ద గ్రాముకు రూ.11 వేల వరకు రుణం పొందే అవకాశముంది. ప్రస్తుత ధరల ప్రకారం రూ.1.37 కోట్ల వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది. అయితే కొన్ని బ్యాంకులు గరిష్ట రుణ పరిమితిపై ఆంక్షలు విధించారు. ఎస్‌బీఐ రూ.50 లక్షల వరకు మాత్రమే గోల్డ్ లోన్ అందిస్తుంది.
ఎలా లెక్కిస్తారు..?
-ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం గోల్డ్, వెండి ఆభరణాలు లేదా కాయిన్స్ ద్వారా లోన్ పొందే సమయంలో దాని ప్రస్తుత మార్కెట్ వాల్యూ, స్వచ్చత ఆధారంగా రుణ పరిమితిని లెక్కిస్తారు.
-గత 30 రోజుల్లో బంగారం, వెండి సగటు ముగింపు ధర ఆధారంగా రుణ పరిమితి నిర్దారిస్తారు
-ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ద్వారా నియంత్రించబడే కమోడిటీ ఎక్స్ఛేంజ్ ప్రచురించిన నిర్దిష్ట స్వచ్ఛత కలిగిన బంగారం లేదా వెండి మునుపటి ముగింపు ధర ఆధారంగా లోన్ మొత్తాన్ని లెక్కిస్తారు.
ఈ సమయంలో పరిహారం పొందొచ్చు
ఒకవేళ రుణం మొత్తం చెల్లించిన తర్వాత బ్యాంకులు గోల్డ్‌ను తిరిగి కస్టమర్‌కు తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ రోజు రూ.5 వేల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ తన నిబంధనల్లో పేర్కొంది. ఇక బంగారం తాకట్టు పెట్టిన తర్వాత బంగారం స్వచ్చతలో తేడాలు వచ్చినా లేదా ఏదైనా నష్టం జరిగినా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. తిరిగి ఇచ్చే సమయంలో పరిమాణం లేదా స్వచ్చతో లోపాలు లేదా వ్యత్యాసాలు వచ్చినా పరిహారం పొందవచ్చు.
