ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు అందుబాటులోకి రానే వచ్చాయి. దసరా పండుగను పురస్కరించుకుని ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ప్రయోగాత్మకంగా రిలయన్స్ జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జియో వెల్కమ్ ఆఫర్ పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక ఆఫర్ కింద వినియోగదారులకు 1జీబీపీఎస్ స్పీడుతో అన్ లిమిటెడ్ డాటా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈనేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ జియో 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో యాజమాన్యం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో నెట్ వర్క్ ప్రయత్నాలు ప్రారంభించింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో సహా మరికొన్ని ప్రధాన నగరాల్లో 5జీ నెట్‌వర్క్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. దశల వారీగా రాష్ట్రంలోని మిగతా నగరాలు, పట్టణాలకు కూడా 5జీ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
కాగా జియోకు దేశవ్యాప్తంగా 42.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇక 4జీ సేవలను అందించటంలో తన ఆధిపత్యాన్ని చాటుకున్న జియో 5జీ వేగంలోనూ టాప్‌లోనూ నిలుస్తోంది. ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా విడుదల చేసిన డేటా ప్రకారం రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ వేగాన్ని నమోదు చేసిందట. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, వారణాసి ప్రాంతాల్లో జూన్ నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. కాగా దశల వారీగా దేశవ్యాప్తంగా అందరికీ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని జియో యాజమాన్యం తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..