రిలయన్స్ ఈ పేరే ఓ బ్రాండ్. దేశంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం రోజురోజుకీ విస్తరిస్తూనే ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ఫ్యాషన్, రిటైల్, ఆయిల్ మొదలైన అనేక రంగాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలయన్స్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇకపై సెలూన్ రంగంలోనూ తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారతీయ సెలూన్ మార్కెట్‌లో అతిపెద్ద వాటాను కలిగి ఉన్న నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో 49 శాతం వాటాను కొనుగోలు చేయబోతోంది.
ఈ డీల్‌లో భాగంగా నేచురల్స్ సెలూన్ అండ్ స్పా మాతృ సంస్థ గ్రూమ్ ఇండియా సెలూన్స్ అండ్ స్పాతో రిలయన్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో హెచ్‌యూఎల్‌కు చెందిన లాక్మే, ప్రాంతీయ బ్రాండ్లయిన ఎన్‌రిచ్, గీతాంజలికి రిలయన్స్ రిటైల్ పోటీ ఇచ్చే అవకాశం ఉంది. తాజా నివేదికల ప్రకారం నేచురల్స్‌కి దేశవ్యాప్తంగా 700 కంటే ఎక్కువ స్పాలు ఉన్నాయి. దీంతో రిలయన్స్ కంపెనీలో 49% వాటాను కొనుగోలు చేసినప్పటికీ, దాని నిర్వహణ బాధ్యత మునుపటిలా ప్రమోటర్లపైనే ఉంటుందని సమాచారం. రిలయన్స్‌తో ఒప్పందం చేసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా తమ స్టోర్ల సంఖ్యను పెంచుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. దీనితో పాటు, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంపై దృష్టిసారిస్తోంది.
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి తర్వాత తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సెలూన్ రంగం ఒకటి. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా సెలూన్‌లు చాలా నెలలు మూతపడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధార పడ్డ వారు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయి. తాజా నివేదికల ప్రచారం సెలూన్ పరిశ్రమ విలువ సుమారు రూ. 20 వేల కోట్లుగా ఉంది. దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామల్లో సుమారు 65 లక్షల బ్యూటీ పార్లర్లు, సెలూన్లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..