త్వరలో రూ.5 వేల నోటు రానుందా.. కేంద్రం క్లారిటీ.. అసలు నిజం ఇదే..

2వేల నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.5000 నోట్లు వస్తున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఇది నిజం అని అనుకుంటున్నారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఆ ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూ.5000 నోటు విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

త్వరలో రూ.5 వేల నోటు రానుందా.. కేంద్రం క్లారిటీ.. అసలు నిజం ఇదే..
Pib Clarity On 5000 Note

Updated on: Nov 24, 2025 | 9:20 PM

2016లో పెద్దనోట్లను రద్దు చేసి కేంద్రం ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత 2వేల నోట్లను కొత్తగా తీసుకొచ్చింది. అయితే కొన్నాళ్లకు ఆ నోటును కూడా రద్దు చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇటీవల ఒక వార్త వైరల్‌గా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కొత్తగా రూ. 5 వేల కరెన్సీ నోట్లను విడుదల చేయబోతోందనేది నెట్టింట్ హల్‌చల్ చేస్తుంది. ఈ ప్రచారం విస్తృతంగా వ్యాప్తి చెందడంతో చాలా మంది ప్రజలు దీనిని నిజమే అని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై కేంద్రం స్పందించింది. భారత ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.”కొత్త రూ. 5 వేల నోట్లను తీసుకురావాలన్న నిర్ణయమేదీ ఆర్బీఐ తీసుకోలేదు. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం” అని పీఐబీ స్పష్టం చేసింది.

అప్రమత్తత అవసరం..

ఇటీవలి కాలంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి, ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం ప్రజలను తరచుగా అప్రమత్తం చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం కోసమైనా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఎలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఏటీఎం పిన్, ఆధార్ వివరాలు, ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరితోనూ ఆన్‌లైన్‌లో పంచుకోవద్దని ప్రభుత్వం సూచించింది.

2023 మే నెలలో ఆర్బీఐ రూ. 2 వేల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రూ. 5 వేల కొత్త నోటు వస్తుందనే పుకారు వేగంగా వ్యాపించింది. మీకు ఏదైనా అనుమానాస్పద సమాచారం లేదా వైరల్ అవుతున్న ఫొటో కనిపిస్తే, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నంబర్ 918799711259 కు లేదా @pibfactcheck ఎక్స్ ఖాతాకు పంపించి కన్ఫార్మ్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి