బంగారం అంటే మన దేశ ప్రజలకు మక్కువ ఎక్కువ. ఏ శుభకార్యమైనా, పండుగైనా వచ్చిందంటే మొదటి ఆలోచించేది పసిడి గురించే. కొన్ని పండుగలు కేవలం బంగారం కొనుగోలు కోసమే ఉన్నాయంటే మన దగ్గర ఆ పసుపు వర్ణం లోహానికి ఎంత విలువ ఉందో అర్థం అవుతోంది. బంగారంపై మక్కువ కేవలం భారతీయ జనాలకే కాదు.. భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ)కి కూడా ఉందంటే కాస్త అతిశయోక్తిలా అనిపించవచ్చు. అయితే ఇదే వాస్తవం. ఆర్బీఐ ఏకంగా టన్నుల లెక్కన బంగారాన్ని కొనుగోలు చేసి రికార్డులు నమోదు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆర్బీఐ గత సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 9 టన్నుల పసిడిని కొనుగోలు చేసింది. అదే క్రమంలో గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్ లు మొత్తంగా 337 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. దీంతో ఆయా దేశాల వద్ద బంగారం నిల్వలు గత త్రైమాసికం అంటే జూలై-సెప్టెంబర్ లో భారీగా పెరిగాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) చెబుతున్న దాని ప్రకారం మన దేశంలో అధికారికంగా సెప్టెంబర్ చివరి నాటికి 806.7 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 19.3 టన్నుల కొనుగోళ్లు జరిగాయి. 2017 నుంచి ఆర్‌బీఐ బంగారం కొనుగోళ్లను పెంచింది. అప్పటి నుంచి ప్రస్తుత సంవత్సరం వరకు అది 248.9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిందని డబ్ల్యూజీసీ వెల్లడించింది.
భారతదేశం దగ్గర ప్రస్తుతం మొత్తం విదేశీ మారక నిల్వలు సెప్టెంబర్ 29 నాటికి 586.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వీటిలో బంగారం విలువ 43.7 బిలియన్ డాలర్లు లేదా మొత్తం నిల్వలలో 7.44% అని అక్టోబర్ 6న ఆర్బీఐ వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్ లో తెలిపింది. నవంబర్ 10 నాటికి ఆర్బీఐ డేటా ప్రకారం మొత్తం నిల్వలు 590 బిలియన్ డాలర్లు కాగా వాటిలో బంగారం విలువ 45.5 బిలియన్ డాలర్లు లేదా మొత్తం 7.7% వద్ద ఉన్నట్లు చూపిస్తుంది. మరో ఎనభై ఎనిమిది శాతం నిల్వలు విదేశీ కరెన్సీ రూపంలో ఉన్నాయి.
ఆర్బీఐ ఎంత బంగారాన్ని కొనుగోలు చేస్తుందో స్పష్టంగా వెల్లడించనప్పటికీ, తాజా కొనుగోళ్లు యూఎస్ ట్రెజరీలు, విదేశీ మారకపు మార్కెట్‌లో అస్థిరత మధ్య మరింత బ్యాలెన్సింగ్ చర్యను ప్రతిబింబిస్తున్నాయని ఆనంద్‌రాతి గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ సుజన్ హజ్రా అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ మాట్లాడుతూ, ఎంత కరెన్సీలు కలిగి ఉండాలి? ఎంత మొత్తంలో ఉంచాలి? అనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్గత విధానాన్ని కలిగి ఉన్నందున యూఎస్ టీ-బిల్ దిగుబడి లేదా డాలర్ తగ్గడం ప్రారంభించినప్పుడు బంగారం వైవిధ్యభరితంగా పనిచేస్తుందని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..