NPS Rules Changed: కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల కోసం కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. అలాగే ఉన్న స్కీమ్‌లలో మార్పులు చేర్పులు చేస్తోంది. ప్రజలకు మేలు జరిగే విధంగా మార్పులు చేస్తుంటుంది కేంద్రం. వినియోగదారులకు ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో మరో మార్పు చేసింది. ఈ ఎన్‌పీఎస్‌లో చేరేందుకు గరిష్ట వయసు 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలకు పెంచింది. ఈ పథకంలో 18 నుంచి 70 సంవత్సరాలున్న వారు చేరవచ్చు. ఈ మార్పుతో నేషనల్ పెన్షన్ స్కీమ్‌దారులకు భారీ ఉపశమనం కలిగించినట్లయ్యింది.
పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) 65 సంవత్సరాల తర్వాత చేరిన వారే వారి కోసం నిబంధనలు సవరించింది. ఈ కొత్త నిబంధనలను సడలించడంతో పాటు ఈక్విటీలో 50 శాతం వరకు నిధులను కేటాయించడానికి పీఎఫ్‌ఆర్‌డీఏ అనుమతి ఇచ్చింది. అయితే ఈక్విటీ ఎక్స్‌పోజర్ గరిష్టంగా 15 శాతం మాత్రమే అవుతుంది. ఎన్‌పీఎస్‌లో 65 ఏళ్లు దాటిన చందాదారులు చేరితే డిఫాల్డ్ ఆటో, యాక్టివ్ ఛాయిస్ కింద చేరితే వరుసగా 15 శాతం మరియు 50 శాతం గరిష్ట ఈక్విటీ ఎక్స్‌పోజర్‌తో పీఎఫ్, ఆస్తి కేటాయింపులను ఎంచుకోవచ్చు. 70 ఏళ్లు ఉన్నవారు ఎన్‌పీఎస్‌లో చేరితే 75 ఏళ్లు వచ్చే వరకు కొనసాగించవచ్చు.
తాజా నిర్ణయం ప్రకారం, చందాదారుల పెన్షన్ కార్పస్ ఫండ్ రూ. 5 లక్షల వరకు ఉంటే.. ఆ మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. వారు యాన్యుటీలు కొనుగోలు చేయకుండానే ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు పీఎఫ్ఆర్డిఏ చందాదారులను అనుమతించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, పదవీ విరమణ సమయంలో లేదా 60 ఏళ్లు నిండిన తర్వాత చందాదారులు పెన్షన్ కార్పస్ నుంచి ఒకేసారి రూ. 2లక్షల కంటే ఎక్కువ తీసుకునే వీలులేదు.
ఈ పరిమితి దాటిన తర్వాత పెన్షనర్లు తమ కాంట్రిబ్యూషన్లో 60 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. మిగిలిన 40 శాతంతో బీమా సంస్థలు ఆఫర్ చేసే యాన్యుటీ ప్లాన్లలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. ఈ నియమాన్ని తొలగించింది. అంటే.. ఎటువంటి యాన్యుటీని కొనుగోలు చేయకుండానే ఇకపై రూ. 5 లక్షల వరకు పెన్షన్ కార్పస్ ఫండ్‌ను ఉపసంహరించుకోవచ్చు.