భారత్‌లో చెల్లింపులు చేయడానికి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్), క్యూఆర్ కోడ్ ఉపయోగంతో మొత్తం లావాదేవీల వ్యవస్థనే మారిపోయింది. దేశంలో యూపీఐ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది. నవంబర్‌లో 15.48 బిలియన్ల లావాదేవీలు జరగగా అక్టోబర్ నాటికి ఇది 7 శాతం పెరిగింది. ఈ విధానం నచ్చి విదేశాలు సైతం యూపీఐని వాడుతున్నాయి. కానీ, యూపీఐకి డిమాండ్ పెరగడంతో మోసం చేసేందుకు కొత్తదారులు వెతుకున్నారు మోసగాళ్లు. కొత్తగా ఇప్పుడు స్కామర్లు క్యూఆర్ కోడ్ ద్వారా మోసాలకు దిగుతున్నారు.
నేటి కాలంలో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల్లో వేగం పెరుగుతోంది. ఈ సౌలభ్యాన్ని అవకాశంగా తీసుకుని స్కామర్లు కూడా డబ్బును కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దుకాణాలు, బండ్లు, డెలివరీ ఏజెంట్లు మొదలైన ప్రదేశాల్లో నకిలీ క్యూఆర్ కోడ్లను ఉంచుతారు. వినియోగదారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వారి ఖాతాను హ్యాక్ చేస్తారు. ఇదే కాకుండా కొన్ని సార్లు స్కామర్లు ఏపీకే లింక్‌ను క్యూఆర్ కోడ్‌తో అనుసంధానిస్తారు. దీనితో కోడ్ స్కాన్ చేయగానే వైరస్ ఉన్న అప్లికేషన్లు ఫోన్లో డౌన్లోడ్ అవుతాయి. దాని ద్వారా వినియోగదారుల ఖాతాలోని డబ్బు అంతా కొల్లగొడుతారు.
ఇలాంటి మోసాలను నివారించడానికి మొదటి మార్గం అప్రమత్తంగా ఉండటమే. యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు క్యూఆర్ కోడ్‌పై ఆధారపడే బదులు చెల్లింపును స్వీకరించే వ్యక్తికి చెందిన ధ్రువీకరించిన యూపీఐ ఐడీ లేదా మొబైల్ నంబర్‌కు నేరుగా డబ్బు పంపడం ఉత్తమం. అంతేకాకుండా చెల్లింపు సమయంలో అవతలి వ్యక్తి మనకు తెలియనప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదేకాకుండా అనుమానాస్పదంగా అనిపించే కొత్త స్థలాలు లేదా వ్యాపారాల్లో క్యూఆర్‌ను స్కాన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. రెస్టారెంట్లు, షాపుల్లో నకిలీ క్యూఆర్ కోడ్లను స్కామర్లు సులభంగా ఇన్స్టాల్ చేయవచ్చు. అందువల్ల చెల్లింపు చేసే ముందు క్యూఆర్ కోడ్ సరైనదేనా? కాదా? అని ప్రతిసారి ధ్రువీకరించుకోవాలి.