Aadhaar APP: ఆధార్ కార్డ్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జనవరి 28 నుంచి కొత్త యాప్.. పూర్తిగా మారనున్న రూల్స్..

ఆధార్ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్. త్వరలో ఆధార్ కొత్త యాప్ రానుంది. ఇక నుంచి మీరు భౌతికంగా ఆధార్ కార్డును ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ద్వారా ఈధార్ అవసరమైన చోట ధృవీకరణలు పూర్తి చేసుకోవచ్చు. ఈ యాప్ ఫీచర్లు ఇందులో చూద్దాం.

Aadhaar APP: ఆధార్ కార్డ్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జనవరి 28 నుంచి కొత్త యాప్.. పూర్తిగా మారనున్న రూల్స్..
Aadhaar New App

Updated on: Jan 26, 2026 | 4:13 PM

ఆధార్ కార్డు సేవలను సులభతరం చేసేందుకు యూఐడీఏఐ ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆధార్ కార్డ్‌ను సురక్షితంగా, దుర్వినియోగం కాకుండా వాడుకునేందుకు వీలుగా నూతన మార్పులు తీసుకొస్తుంది. ప్రతీ దానికి ఆధార్ కార్డు అవసరం కావడంతో ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరగాల్సి ఉంటుంది. అలాగే వేర్వేరు పనుల కోసం జిరాక్స్ కాపీలు ఇవ్వడం వల్ల వాటిని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు యూఐడీఏఐ కొత్త యాప్‌ను తీసుకొస్తుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే మీకు ఫిజికల్ కార్డుల అవసరం ఉండదు. కేవలం యాప్ ద్వారానే పేపర్ లెస్ విధానం ద్వారా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.

జనవరి 28న కొత్త యాప్ లాంచ్

జనవరి 28వ తేదీన కొత్త ఆధార్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది. ఈ యాప్ ద్వారా ఏదైనా వెరిఫికేషన్ కోసం అవసరమైన వివరాలను మాత్రమే ఇతరులతో పంచుకోవచ్చు. ఫిజికల్ కార్డుతో పని లేకుండా ధృవీకరణ కోసం అవసరమైన ఆధార్ వివరాలను మాత్రమే షేర్ చేయవచ్చు. ఇక హోటల్‌లో రూమ్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు అడుగుతారు. ఇప్పటివరకు హోటల్ సిబ్బంది కస్టమర్ ఆధార్ జిరాక్స్ తీసుకునేవారు. కానీ ఇప్పటినుంచి ఆ అవసరం లేదు. ఈ యాప్ ద్వారా డిజిటల్‌గా వివరాలు పంచుకోవచ్చు.

యాప్ వల్ల ప్రయోజనాలు

-జిరాక్స్‌ల వల్ల జరిగే ఆధార్ దుర్వినియోగానికి చెక్ పడనుంది
-పర్సులో ఆధార్ కార్డును క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు
-డిజిటల్‌గా ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు
-అవసరమైన ఆధార్ వివరాలు మాత్రమే ఇతరులతో షేర్ చేసుకోవచ్చు
-వ్యక్తిగత వివరాలు అనవసరంగా బహిర్గతం కాకుండా గుర్తింపు ధృవీకరణ పూర్తి చేయవచ్చు

పూర్తి స్థాయి వెర్షన్ ప్రారంభం

గతంలోనే ఆధార్  పేరుతో ఈ కొత్త యాప్ తీసుకురాగా.. ఇప్పుడు పూర్తి స్థాయి వెర్షన్‌ను జనవరి 28న యూఐడీఏఐ లాంచ్ చేయనుంది.  గతంలో వచ్చిన యాప్‌లో కుటుంబసభ్యుల ఆధార్ వివరాలు అన్నీ ఒకేచోట భద్రపర్చుకోవడంతో పాటు  యాప్ ఓపెన్ చేయగానే మీ ఆధార్ కార్డు కనిపించేలా ఫీచర్ తీసుకొచ్చింది. అలాగే బయోమెట్రిక్ వివరాలు లాక్ చేసుకోవడంతో పాటు ఇంటర్నెట్ లేకుండా ఆధార్ వివరాలు యాక్సెస్ చేసేలా వెసులుబాటు కల్పించింది. ఇక భౌతిక ఆధార్ కార్డు అవసరం లేకుండా సురక్షితంగా, సులభంగా ఆధార్ వివరాలను పంచుకునే వీలు కల్పిస్తోంది. ఇప్పుడు ఈ యాప్‌లో మరిన్ని ఫీచర్లు జోడించి పూర్తి స్థాయి వెర్షన్‌ను త్వరలో యూఐడీఏఐ అందుబాటులోకి తెస్తోంది.