
తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి రానుంది. మార్చి 1వ తేదీన తమిళనాడులోని మధురై వేదికగా నాలుగు కొత్త రైలు సర్వీసులను ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ అయింది. మంగళూరు సెంట్రల్-రామేశ్వరం-మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, తాంబరం- మంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూర్-ధనాబాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు నాగర్‌కోయిల్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు.
అలాగే దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొత్తగా అభివృద్ది చేసిన 8 స్టేషన్లను మోదీ మార్చి 1వ తేదీన మధురై నుంచి జాతికి అంకితం చేయనున్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు నుంచి ఈ రైళ్లను మోదీ ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రైళ్ల టైం షెడ్యూల్, రూట్, ఏయే స్టేషన్లలో ఆగుతాయనే దానిపై రైల్వేశాఖ ఇంకా వివరాలు వెల్లడించలేదు. త్వరలోనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను రైల్వేశాఖ ప్రకటించే అవకాశముంది. తాంబరం-మంగళూరు AB ఎక్స్‌ప్రెస్ మంగళూరు జంక్షన్ నుండి వారానికోసారి సర్వీసులు అందించనుంది.
గత నెల జనవరి 27వ తేదీన చర్లపల్లి-తిరువనంతపురం నార్త్ వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. ఈ రైలు తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుంది. మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. తర్వాతి రోజు 14.45 నిమిషాలకు తిరువనంతపురం చేరుకుంటుంది. నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, చెన్నై ఎగ్మోర్, తిరూచీ, మధురై, కొల్లం స్టేషన్లలో ఇది ఆగుతుంది. ఇందులో నాన్ ఏసీ స్లీపర్, జనరల్, ప్యాంట్రీ కార్ కోచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తోండగా.. ఇప్పుడు మరో ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.